Telugu Global
Telangana

తెలంగాణలో 7 ప్రభుత్వ ఆస్పత్రులకు జాతీయ స్థాయి గుర్తింపు

ధంసులాపురం ఆస్పత్రి 97శాతం స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ గుర్తింపు పొందిన 7 ఆస్పత్రులకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయి.

తెలంగాణలో 7 ప్రభుత్వ ఆస్పత్రులకు జాతీయ స్థాయి గుర్తింపు
X

తెలంగాణ వైద్యరంగానికి మరో అరుదైన గుర్తింపు ఇది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఏడు ప్రభుత్వ ఆస్పత్రులకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నాణ్యత ప్రమాణాలు, రోగులకు మెరుగైన వైద్య సేవలు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ విభాగాల్లో ఏడు ఆస్పత్రులు మెరుగైన పనితీరు కనబరిచాయి.

ఖమ్మం జిల్లా ధంసులాపురం, అదిలాబాద్‌ జిల్లా ధనోరా, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, సూర్యాపేట జిల్లా రామారం, భూపాలపల్లి జిల్లా జంగేడు, నల్లగొండ జిల్లా ముషంపల్లి, జగిత్యాల జిల్లా ధరూర్‌ హెల్త్‌ అండ్ వెల్‌ నెస్‌ సెంటర్లకు కేంద్రం ఉత్తమ ఆస్పత్రులుగా గుర్తింపునిచ్చింది. ధంసులాపురం ఆస్పత్రి 97శాతం స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ గుర్తింపు పొందిన 7 ఆస్పత్రులకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయి. అభివృద్ధి, విస్తరణల కోసం మూడేళ్లపాటు నిధులు విడుదల చేస్తారు.

గత నెలలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య, ఆరోగ్య సంరక్షణ, పల్లె, బస్తీ దవాఖానాలను జాతీయ వైద్యబృందం సందర్శించింది. ప్రజలకు అందుతున్న సేవలు, పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ, ఆరోగ్య కార్యక్రమాలు అమలు, పరిసరాల పరిశుభ్రత, తదితర అంశాలపై ఆరా తీసింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించింది. ఈ బృందం అందజేసిన నివేదికల ఆధారంగా జాతీయ వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తమ ఆస్పత్రులను ఎంపిక చేసింది. నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్స్‌(ఎన్‌ క్వాస్‌) ఈ ఆస్పత్రులకు సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తుంది.

తెలంగాణలో ప్రభుత్వరంగంలో వైద్యానికి, వైద్య విద్యకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రులు మెరుగైన సౌకర్యాలతో రోగులకు సేవలందిస్తున్నాయి. వైద్యవిద్య సీట్లు పెరగడం కూడా తెలంగాణకు వైద్యరంగానికి మరో వరం అని చెప్పాలి. ఆ ప్రయత్నాలతోనే ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలంగాణ ఆస్పత్రులకు గుర్తింపు లభిస్తోంది.

First Published:  23 Sept 2023 1:18 PM IST
Next Story