Telugu Global
Telangana

ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకేరోజు 35 ప్రసవాలు.. ఇదో రికార్డ్

జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఒకేరోజు వైద్యులు 35మందికి ప్రసవం చేశారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 35 ప్రసవాలు చేసి రాష్ట్రంలోనే అరుదైన రికార్డును సాధించారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకేరోజు 35 ప్రసవాలు.. ఇదో రికార్డ్
X

తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ విభజనకు ముందు, విభజన తర్వాత అన్నట్టుగా మారిపోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కారు హయాంలో తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులు.. సౌకర్యాలు, వైద్య సేవల విషయంలో కార్పొరేట్లకు ధీటుగా మారిపోయాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అనే నానుడి పూర్తిగా మారిపోయింది. ఎవరికి ఏ అవసరం వచ్చినా సర్కారు ఆస్పత్రికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ జనగామలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో జరిగిన 35 ప్రసవాలు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అంటేనే చాలామంది వెనకడుగు వేస్తారు. నార్మల్ డెలివరీ అయితే పర్లేదు కానీ, సిజేరియన్ అంటే వెంటనే ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తారు. అలాంటిది జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల వ్యవధిలో మొత్తం 35 ప్రసవాలయ్యాయి. ఇదో సరికొత్త రికార్డ్ అంటున్నారు వైద్యులు.

జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఒకేరోజు వైద్యులు 35మందికి ప్రసవం చేశారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 35 ప్రసవాలు చేసి రాష్ట్రంలోనే అరుదైన రికార్డును సాధించారు. 35 డెలివరీల్లో 9 నార్మల్‌ డెలివరీలు కాగా.. మిగతా వారికి ఆపరేషన్‌ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 35 ప్రసవాల్లో 20 మంది మగ పిల్లలు, 15 మంది ఆడపిల్లలు జన్మించినట్లు తెలిపారు. విజయవంతంగా ఈ కార్యక్రమం పూర్తి చేసిన సిబ్బందికి మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంపొందించే విధంగా కృషి చేశారని ప్రశంసించారు.


తెలంగాణలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు, వాటిలో మౌలిక సదుపాయాలు, మెరుగైన వసతులు కల్పించడంతో గర్భిణులు, బాలింతలు ఎక్కువగ ఈ ఆస్పత్రులకు వస్తున్నారు. జనగామలోని ఆస్పత్రికి జిల్లా నుంచే కాకుండా, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట జిల్లాలోని పలు మండలాల నుంచి కూడా పేషెంట్లు వస్తుంటారు. ఈ ఆస్పత్రిలో రోజుకు సుమారు 300 నుంచి 350 మంది ఔట్ పేషంట్లకు వైద్య సేవలు అందిస్తారు. క్వాలిటీ మందులు అందుబాటులో ఉండడం, 102 సేవలు మెరుగ్గా అందడం వల్ల ఈ ఆస్పత్రికి భారీగా పేషెంట్లు వస్తున్నారని తెలుస్తోంది.

First Published:  11 Jan 2023 11:08 AM IST
Next Story