Telugu Global
Telangana

అర్చకుల గౌరవ భృతి భారీగా పెంపు.. ఉత్తర్వులు విడుదల

గౌరవ భృతి పెంపుతో తెలంగాణ వ్యాప్తంగా 6,541 మంది అర్చకులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతి ఏటా అర్చకుల కోసం రూ.47.09 కోట్లు కేటాయింపులు చేస్తుండగా ఇప్పుడది ఏడాదికి రూ.78.49 కోట్లకు పెరుగుతుంది.

అర్చకుల గౌరవ భృతి భారీగా పెంపు.. ఉత్తర్వులు విడుదల
X

తెలంగాణ ఏర్పడే నాటికి ధూప దీప నైవేద్యాలకు ఇచ్చే భృతి రూ.2,500

తెలంగాణలో ఇప్పటి వరకు అర్చకుల గౌరవ భృతి రూ.6,000

ఇకపై గౌరవ భృతి రూ.10,000

ఒకేసారి 4వేల రూపాయలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలోనే ఈ విషయంపై అర్చకుల సంఘాలకు సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. తాజాగా జీవో విడుదలతో ఆయా వర్గాల్లో సంతోషం నెలకొంది. కేవలం మూడు నెలల్లోనే సీఎం కేసీఆర్ తన హామీని అమలు చేశారంటూ అర్చకులు సంబరపడుతున్నారు.

కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు..

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆలయంలో ఈ రోజు సీఎం కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించాలని అర్చక సంఘాలు తీర్మానించాయి. అరకొర ఆర్థిక సాయంతో ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందులు పడుతున్నామని, అలాంటి వారందరికీ ఈ పెంపు ఆసరాగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 4వేల రూపాయలు ధూపదీప నైవేద్యాలకు 6వేల రూపాయలు అర్చకులకు గౌరవ వేతనంగా ఉంటుంది.

6,541 మంది అర్చకులకు లబ్ధి

గౌరవ భృతి పెంపుతో తెలంగాణ వ్యాప్తంగా 6,541 మంది అర్చకులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతి ఏటా అర్చకుల కోసం రూ.47.09 కోట్లు కేటాయింపులు చేస్తుండగా ఇప్పుడది ఏడాదికి రూ.78.49 కోట్లకు పెరుగుతుంది. ప్రభుత్వంపై అదనంగా రూ.31.4 కోట్ల భారం పడుతుందని, అయినా అర్చకుల శ్రేయస్సు, ఆలయాల్లో ధూప దీప నైవేద్య కార్యక్రమాలు జరగాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ వేతనాలను పెంచాలని నిర్ణయించారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన అనంతరం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి అర్చకులు క్షీరాభిషేకం చేశారు. అన్ని కులమతాలను సమానంగా ఆదరిస్తున్న కేసీఆర్‌ కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తారని వారు దీవించారు.

గతంలో 1,805 ఆలయాలకు మాత్రమే ధూపదీప నైవేద్య భృతి అందేదని, బీఆర్ఎస్ హయాంలో వాటి సంఖ్య 6,541కి పెరిగిందని చెప్పారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. భవిష్యత్తులో మరిన్ని ఆలయాలకు విస్తరించాలనే ప్రతిపాదన ఉందని తెలిపారు.


First Published:  30 Aug 2023 7:13 AM IST
Next Story