మైనార్టీలకు శుభవార్త.. ఉత్తర్వులు జారీ
ఇటీవలే బీసీ బంధు అమలులోకి వచ్చింది. తాజాగా మైనార్టీల ఆర్థిక సాయానికి సంబంధించి ఉత్తర్వులు విడుదలయ్యాయి.
తెలంగాణలోని మైనార్టీలకు ఇది శుభవార్త. దీని గురించి రెండు మూడు రోజుల ముందే మంత్రి హరీష్ రావు హింట్ ఇచ్చారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలోని మైనార్టీలకు పూర్తి సబ్సిడీతో లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన విధి విధానాలతో కూడిన ఉత్తర్వులను ఈరోజు జారీ చేసింది.
రాష్ట్రంలోని బిసిలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలనే ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో… pic.twitter.com/MU8w0Qou82
— Telangana CMO (@TelanganaCMO) July 23, 2023
అన్ని వర్గాల సంక్షేమం..
తెలంగాణలో దళితబంధు ప్రవేశ పెట్టిన తర్వాత మిగతా వర్గాలనుంచి కూడా డిమాండ్లు మొదలయ్యాయి. అయితే సీఎం కేసీఆర్ అప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. దళితబంధులాగే.. మిగతా వర్గాలకు కూడా ఆర్థిక సాయం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఒకదాని తర్వాత ఒకటి అమలులోకి తెస్తున్నారు. ఇటీవలే బీసీ బంధు అమలులోకి వచ్చింది. తాజాగా మైనార్టీల ఆర్థిక సాయానికి సంబంధించి ఉత్తర్వులు విడుదలయ్యాయి.
కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని చెప్పారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. భిన్న సంస్కృతులను, విభిన్న మతాల ఆచార సంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తెహజీబ్ ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నారు. విద్య, ఉపాధి సహా వివిధ రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనారిటీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతోందని చెప్పారు సీఎం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థమైన కార్యాచరణ సత్ఫలితాలను అందిస్తుందని పేర్కొన్నారు.