తెలంగాణలో దీపావళి సెలవు మార్పు.. ఈసారి ట్రిపుల్ ధమాకా
గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబర్ 12వ తేదీ దీపావళి సెలవుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి సెలవును నవంబర్ 13కు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవును మార్చింది. ముందుగా ప్రకటించినట్లుగా దీపావళి సెలవును 12వ తేదీ ఆదివారం కాకుండా 13వ తేదీ సోమవారానికి మార్చింది. శనివారం సెకండ్ సాటర్‌డే, ఆదివారం, సోమవారం దీపావళి సెలవు కలిపి ఈసారి ట్రిపుల్ ధమాకా అన్నమాట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి సెలవును 13వ తేదీకి మార్చడంతో ఇక్కడ కూడా మార్చుతారని ఊహాగానాలు వచ్చాయి. చివరికి అందరి ఊహాగానాలు నిజమయ్యాయి. దసరా పండుగ తేదీ కూడా ఇలాగే మారింది.
గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబర్ 12వ తేదీ దీపావళి సెలవుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి సెలవును నవంబర్ 13కు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. మార్చిన సెలవు దినాన్ని పాఠశాలలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా అమలు చేయాలని ఆదేశించింది.
పండితుల సలహా మేరకే మార్పు
తెలంగాణ సర్కార్ ఎంప్లాయీస్‌కు ఇచ్చే సాధారణ సెలవుల జాబితా ప్రకారం నవంబర్ 12నే దీపావళి సెలవు ఇచ్చారు. అయితే తాజాగా పండితుల సలహా మేరకు సెలవు దినాన్ని మార్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు రెండో శనివారం, ఆదివారం, సోమవారం దీపావళితో కలుపుకుని వరుసగా 3 రోజులపాటు సెలవులు రానున్నాయి.