Telugu Global
Telangana

కేసీఆర్ పంచిన చెక్కులపై దుష్ప్రచారం.. అసలు నిజం ఏంటంటే..?

వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి. వాటిపై వెంటనే తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

కేసీఆర్ పంచిన చెక్కులపై దుష్ప్రచారం.. అసలు నిజం ఏంటంటే..?
X

సాగు చట్టాల రద్దుకోసం ఉద్యమం చేస్తూ ఆ పోరాటంలో అసువులుబాసిన పంజాబ్, హర్యానాకు చెందిన 709 రైతు కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఏడాది మే 22న ఆర్థిక భరోసా అందించారు. మొత్తం 1010 చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అయితే ఈ చెక్కులు నగదు రూపంలోకి మారడం లేదని దుష్ప్రచారం మొదలైంది. వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి. వాటిపై వెంటనే తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. చెక్కులు నిజంగానే మారడంలేదా..? అసలు ఏం జరిగింది..?

బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ పంపిణీ చేసిన మొత్తం 1010 చెక్కుల్లో 814 చెక్కులకు నగదు చెల్లింపులు ఇప్పటికే జరిగాయి. మిగిలిన కొన్ని చెక్కులకు మాత్రం నగదు చెల్లింపులు ఆగిపోయాయి. అయితే దానికి ఓ టెక్నికల్ రీజన్ ఉందని అంటున్నారు అధికారులు. బ్యాంకు నిబంధనల మేరకు, చెక్కు జారీ చేసిన తర్వాత 3 నెలల లోగా ఆ చెక్కుని ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి. అలా చేయకపోతే నగదు చెల్లింపులు జరగవు. బాధిత కుటుంబాల్లో కొంతమంది తమ అవసరాలకు అనుగుణంగా 3నెలల గడువు తర్వాత చెక్కులను బ్యాంకుల్లో జమ చేశారు. దీంతో వారికి మాత్రం చెల్లింపులు జరగలేదు. ఇది సాంకేతికంగా జరిగిన పొరపాటే కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరికీ నగదు ఆపలేదని వివరణ ఇచ్చారు తెలంగాణ అధికారులు.

రీవ్యాలిడేట్ కు అవకాశం..

రైతు కుటుంబాలు పొరపాటుగా గడువు తీరిన తర్వాత చెక్కులను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం వల్ల వాటిని నగదుగా మార్చుకోలేకపోయాయి. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం, సంబంధిత బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. గడువుదాటిన తర్వాత డిపాజిట్ చేసిన చెక్కులకు మరికొంత సమయం ఇచ్చి, నగదు చెల్లింపులు జరిగే విధంగా అనుమతివ్వాలని చెప్పింది. ఆ చెక్కులను రీ వ్యాలిడేట్ చేయాలని సూచించింది.

మరిన్ని వివరాలకు..

ఇంకా ఈ విషయంలో ఎవరికైనా అనుమానం ఉంటే, నివృత్తి చేసుకోడానికి తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్ మెంట్ జాయింట్ సెక్రటరీని సంప్రదించాలని అధికారులు సూచించారు. జాయింట్ సెక్రటరీ రాంసింగ్ 9581992577 నెంబరులో అందుబాటులో ఉంటారని ప్రకటించారు. అమరులైన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఓ ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం. రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందే దాకా తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపింది.

First Published:  1 Dec 2022 9:20 PM IST
Next Story