Telugu Global
Telangana

సొంత జాగాలో ఇల్లు.. ప్రభుత్వ సాయం 3 లక్షలు

ఈ సాయం ప్రతి నియోజకవర్గానికి సమానంగా ఉండేలా చూస్తోంది ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గంలో 2వేలమందికి ఈ సాయం అందించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.63 లక్షలమందికి ఇల్లు కట్టుకోడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయబోతోంది.

సొంత జాగాలో ఇల్లు.. ప్రభుత్వ సాయం 3 లక్షలు
X

ఇల్లు నిర్మించుకునేందుకు సొంత స్థలం ఉండి, ఆర్థిక పరిస్థితులు సహకరించనివారికి కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలోనే ప్రతిపాదన చేసినా, ఈ బడ్జెట్ లో అది కార్యరూపం దాల్చింది. ఏకంగా 7890 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయింపులు కూడా జరిగాయి. సొంత స్థలం ఉండి, ఇల్లు కట్టుకోవాలని చూస్తున్న పేదలకు కేసీఆర్ ప్రభుత్వం 3 లక్షల రూపాయలు మంజూరు చేయబోతోంది.

నియోజకవర్గానికి 2వేలమందికి..

ఈ సాయం ప్రతి నియోజకవర్గానికి సమానంగా ఉండేలా చూస్తోంది ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గంలో 2వేలమందికి ఈ సాయం అందించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.63 లక్షలమందికి ఇల్లు కట్టుకోడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయబోతోంది. ఈ పథకం కోసం 7890 కోట్ల రూపాయలు కేటాయించినట్టు అసెంబ్లీలో ప్రకటించారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఆమేరకు నూతన బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయన్నారు.

పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తామంటూ కేంద్రం గొప్పలు చెప్పుకున్నా అది సాధ్యం కాలేదు. 2022 నాటికి దేశంలో ఒక్క పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అని ప్రధాని మోదీ పెట్టిన డెడ్ లైన్లు, ఇచ్చిన హామీలకు కాలం చెల్లింది.

ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలే ఎక్కడికక్కడ సొంతంగా నెరవేర్చుకుంటున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పేదలకు ఆసరాగా నిలిచింది. తాజా బడ్జెట్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 12వేల కోట్లు కేటాయించారు.

వాటికి అదనంగా ప్రతి నియోజకవర్గంలో సొంత స్థలం ఉండి, ఇల్లు కట్టుకోడానికి ఇబ్బంది పడే వారికోసం కూడా నిధులు కేటాయించారు. ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది.

First Published:  6 Feb 2023 1:13 PM IST
Next Story