Telugu Global
Telangana

కమిటీతో కాలయాపనే..! తెలంగాణ ఉద్యోగుల్లో అంతర్మథనం

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి నేతృత్వంలో కోదండరాం, ఐఏఎస్‌ అధికారి దివ్యను కమిటీలో సభ్యులుగా నియమించారు.

కమిటీతో కాలయాపనే..! తెలంగాణ ఉద్యోగుల్లో అంతర్మథనం
X

ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరలో ఉద్యోగుల జీతాలు, పదోన్నతులు, బదిలీలు.. తదితర సమస్యలకు పరిష్కారం చూపెడతానన్నారు. లోక్ సభ ఎన్నికల వేళ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని అనుకున్నారంతా. సీన్ కట్ చేస్తే ఇప్పుడు త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీలతో సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందా, ఒకవేళ అయినా కూడా దానికి గరిష్ట కాల పరిమితి ఉంటుందా అనేది అనుమానమే.

రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి నేతృత్వంలో కోదండరాం, ఐఏఎస్‌ అధికారి దివ్యను కమిటీలో సభ్యులుగా నియమించారు. ఉద్యోగుల సమస్యలపై త్రిసభ్య కమిటీ దృష్టిసారిస్తుంది. ఈ నెల 10న సీఎంతో జరిగిన సమావేశంలో పలు సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతి పత్రాలన్నిటినీ పరిశీలించి వారికి న్యాయం జరిగే దిశగా సిఫారుసులు చేస్తుంది. ఆయా సమస్యల పరిష్కారం కోసం సలహాలు, సూచనలతో నివేదిక అందజేయాలని కమిటీకి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

కమిటీతో కాలయాపన..!

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ సమావేశాన్ని ఎన్నికల జిమ్మిక్కుగా కొట్టిపారేశాయి ప్రతిపక్షాలు. తీరా ఇప్పుడు త్రిసభ్య కమిటీ తెరపైకి రావడంతో సమస్యల పరిష్కారం సాగతీతగా మారుతుందా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ప్రస్తుతానికి కమిటీ రిపోర్ట్ కోసం ప్రభుత్వం ఎలాంటి గడువు విధించలేదు. ఉద్యోగ సంఘాలు ఒత్తిడి చేస్తే మాత్రం దీనిపై ఫలితం ఉండే అవకాశముంది.

First Published:  16 March 2024 7:26 AM IST
Next Story