Telugu Global
Telangana

ఆర్టీసీ స్ట్రైక్ పై గవర్నర్ ట్వీట్

తెలంగాణ ప్రభుత్వం పంపించిన బిల్లుపై తాను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్టు ట్వీట్ చేశారు గవర్నర్ తమిళిసై. వారి హక్కులను కాపాడేందుకే తాను బిల్లుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

ఆర్టీసీ స్ట్రైక్ పై గవర్నర్ ట్వీట్
X

తమ చిరకాల వాంఛ నెరవేరే క్రమంలో గవర్నర్ బిల్లుని ఆపడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళనలకు దిగారు. గవర్నర్ పై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో సడన్ గా స్ట్రైక్ చేపట్టారు. రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ దశలో గవర్నర్ తమిళిసై ఆర్టీసీ స్ట్రైక్ పై ట్వీట్ వేశారు. తనను అర్థం చేసుకోవాలని, ప్రజలకు అసౌకర్యం కలుగజేయొద్దని పిలుపునిచ్చారు.

అధ్యయనం చేస్తున్నా..

తెలంగాణ ప్రభుత్వం పంపించిన బిల్లుపై తాను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్టు ట్వీట్ చేశారు గవర్నర్ తమిళిసై. వారి హక్కులను కాపాడేందుకే తాను బిల్లుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు కూడా తాను వారికోసమే ఆలోచించానని, ఇప్పుడు కూడా వారి బాగు కోసమే ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చారు. సామాన్య ప్రజలు ఆర్టీసీ సమ్మెతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సిబ్బంది సమ్మె విరమించాలని పిలుపునిచ్చారు.


గుజరాత్ నుంచి ఆదేశాలు రావాలా..?

ఆర్టీసీ బిల్లుని గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంపై అటు ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు చేపట్టారు. మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. బిల్లు ఆమోదించాలంటూ గవర్నర్ కి గుజరాత్ నుంచి ఆదేశాలు రావాలేమో అంటున్నారు నెటిజన్లు. గతంలో కూడా పలు బిల్లుల విషయంలో గవర్నర్, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. రాజ్ భవన్ రాజకీయాలకు వేదిక అయిందని, అందుకే ఉద్యోగులకు మేలు చేసే బిల్లుని కూడా గవర్నర్ ఆమోదించలేదని అంటున్నారు. బిల్లు వ్యవహారంలో ఇంత గొడవ జరుగుతున్నా.. తమిళిసై మాత్రం ఎప్పటికి ఆమోదిస్తాననే విషయాన్ని తేల్చి చెప్పలేదు. అధ్యయనం చేస్తున్నానని మాత్రమే ప్రకటించారు.

First Published:  5 Aug 2023 11:45 AM IST
Next Story