తెలంగాణ గవర్నర్ తమిళిసైని రీకాల్ చేయాలి
తెలంగాణ గవర్నర్ తమిళిసైని రీకాల్ చేయాలని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసైని రీకాల్ చేయాలని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోరని, తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రావని తమిళిసై వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు.
ఆమె రాజకీయాల గురించి మాట్లాడడమేమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాలతో ఆమెకు ఏం సంబంధమని వ్యాఖ్యానించిన ఆయన.. ఆమెను రీకాల్ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు.
ఇప్పటికే తమిళిసై ప్రజా దర్బార్ అంటూ మహిళలకోసం వారి ఫిర్యాదులను స్వీకరిస్తూ.. వారికి హామీలు ఇస్తూ.. ఒక విధంగా ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి. అనేక సందర్భాల్లో తమిళిసై బాహాటంగానే టీఆరెస్ ప్రభుత్వానికి , తనకు మధ్య అభిప్రాయభేదాల గురించి ప్రస్తావించారు. పైగా ఆమె రాష్ట్ర గవర్నర్ గా కాక, బీజేపీ ఏజంటులా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో సిపీఐ నేత నారాయణ.. ఆమెను రీకాల్ చేయాలనీ ఏకంగా కేంద్రాన్ని డిమాండ్ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.