Telugu Global
Telangana

నిమ్స్ డైరెక్ట‌ర్ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడంటే.. ఇక్క‌డి ప‌రిస్థితిని మీరు అర్థం చేసుకోండి. - గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తనకు ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశాలు లేవంటూనే ఆమె రాజకీయ విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్‌ మీటింగ్‌కు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని గవర్నర్ ప్రశ్నించడం చర్చనీయాంశమవుతోంది.

నిమ్స్ డైరెక్ట‌ర్ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడంటే.. ఇక్క‌డి ప‌రిస్థితిని మీరు అర్థం చేసుకోండి. - గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై
X

తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనను పదేపదే అవమానిస్తోంద‌ని ఆమె ఆరోపించారు. గవర్నర్‌పై ఈ వివక్ష ఎందుకు చూపుతున్నారని ప్రశ్నించారామె.

తనకు ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశాలు లేవంటూనే ఆమె రాజకీయ విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్‌ మీటింగ్‌కు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని గవర్నర్ ప్రశ్నించడం చర్చనీయాంశమవుతోంది. ఆ సమావేశానికి వెళ్లకపోవడానికి కేసీఆర్‌కు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. ఎట్‌ హోం కార్యక్రమానికి వస్తానని చెప్పిన‌ ముఖ్యమంత్రి రాకపోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు గవర్నర్.

రాజ్‌భవన్‌లో ఉన్నా ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చిందని.. కొన్ని విషయాలను తాను బయటకు చెప్పలేనని.. కానీ వాస్తవాలేంటో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. మేడారం జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్ అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. చివరి నిమిషం వరకు హెలికాప్టర్ ఇస్తారా లేదా అన్న దానిపైనా సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. చివరకు తాను 8 గంటల పాటు రోడ్డు ప్రయాణం చేయాల్సి వచ్చింద‌న్నారు. పెద్ద ఆస్పత్రి డైరెక్టర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

రిపబ్లిక్ డే రోజు గవర్నర్ జెండా వందనం చేయకూడదా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రొటోకాల్‌ను పూర్తిగా తుంగలో తొక్కారని, తన కార్యాలయంపై వివక్ష కొనసాగుతోందన్నారు. తనకు కాకపోయినా గవర్నర్ ఆఫీస్‌కైనా మర్యాద ఇవ్వాలి కదా అని ప్ర‌శ్నించారు. ఒకవేళ తనకు మర్యాద ఇవ్వకపోయినా తన పనితీరులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. గౌరవం ఇవ్వకపోయినా ఎవరినీ లెక్క చేయబోనని చెప్పారు. గవర్నర్‌గా పదవి చేపట్టి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆమె రాజ్‌భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్య‌క్ర‌మంలోనే గ‌వ‌ర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

First Published:  8 Sept 2022 9:45 AM GMT
Next Story