ఈ బిల్లులకు మోక్షమెప్పుడో..?
బిల్లులపై గవర్నర్ ఎందుకు సంతకం పెట్టలేదో ఎవరికీ తెలీదు. పైగా బిల్లులపై సంతకాలు పెట్టే విషయం తన విచక్షణ అంటూ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
రాష్ట్రంలో రెండు భవన్‌ల మధ్య పెరిగిపోతున్న గ్యాప్ ప్రభావం ఫైనల్ గా పరిపాలనపైన పడుతోంది. రాజ్ భవన్లో గరవ్నర్ తమిళిసై ఉంటారని, ప్రగతిభవన్లో కేసీఆర్ ఉంటారని అందరికీ తెలిసిందే. ఈ రెండుభవన్ల మధ్య సమన్వయం ఉంటే పరిపాలన అంశాల్లో ఎలాంటి సమస్యలుండవు. కానీ, దురదృష్టవశాత్తు ఇద్దరి మధ్యా గ్యాప్ పెరిగిపోవటంతో దాని ప్రభావం పాలనాంశాలపైన పడుతోంది. అసెంబ్లీలో తీర్మానంచేసి పంపిన బిల్లులు ఇంకా రాజ్ భవన్లో పెండింగులో ఉండటమే దీనికి ఉదాహరణ.
మొదట్లో ఇద్దరిమధ్యా మంచి సంబంధాలే ఉండేవి. కానీ తర్వాత ఏమైందో తెలీదు కానీ గ్యాప్ మొదలైంది. చిన్నగా మొదలైన గ్యాప్ ఇప్పుడు పెద్దదైపోయింది. మామూలుగా క్రియాశీల రాజకీయాల్లో నుండి వచ్చిన వారిని గవర్నర్లుగా నియమిస్తే సీఎంతో గ్యాప్ వచ్చిందంటే అర్ధముంది. కానీ తమిళిసై తమిళనాడు బీజేపీలో పెద్దగా యాక్టివ్ కాదు. పైగా వృత్తిరీత్యా డాక్టర్. తనకు డాక్టర్ గా ఉంటూ ప్రజలకు సేవచేయటంలోనే ఎక్కువ తృప్తని స్వయంగా ఆమే చెప్పారు.
ఇక విషయానికి వస్తే.. మొన్నటి సెప్టెంబర్లో అసెంబ్లీలో ఎనిమిది బిల్లులపై తీర్మానంచేసి ఆమోదంకోసం గవర్నర్ దగ్గరకు పంపింది ప్రభుత్వం. గవర్నర్ సంతకాలు అయితే కానీ ఆ బిల్లులు చట్టం రూపంలో అమల్లోకి రావు. జీఎస్టీ సవరణ బిల్లుపైన మాత్రం గవర్నర్ వెంటనే సంతకం చేసేశారు. మిగిలిన ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు, యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ల బిల్లు, ఫారెస్టు యూనివర్సిటీ ఏర్పాటు బిల్లు, ఆజమాబాద్ ఇండస్ట్రియల్ అధికారాల సవరణ బిల్లు, మున్సిపల్ చట్టం సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లు, మోటారు వెహికల్ చట్ట సవరణ బిల్లులకు మోక్షం లభించలేదు.
బిల్లులపై గవర్నర్ ఎందుకు సంతకం పెట్టలేదో ఎవరికీ తెలీదు. పైగా బిల్లులపై సంతకాలు పెట్టే విషయం తన విచక్షణ అంటూ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. చేస్తే సంతకాలు చేసి పంపేయాలి. లేదా అభ్యంతరాలుంటే తిప్పిపంపాలి. అంతేకానీ ఏ నిర్ణయమూ తీసుకోకుండా తన దగ్గరే అట్టిపెట్టుకుంటే పలనాపరమైన ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీలో చట్టాలను సవరించిన తర్వాత అవి అమల్లోకి రాకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరొస్తుందని తెలిసీ పెండింగులోనే పెట్టుకున్నారంటే ఏమనర్థం ?