వరద రాజకీయాల్లోకి గవర్నర్ ఎంట్రీ..!
వరదల్లో చిక్కుకున్న ప్రజలను చూస్తుంటే బాధేస్తోందని అన్నారు గవర్నర్ తమిళిసై. ప్రభుత్వం మరింత మెరుగ్గా ప్రజలకు రక్షణగా ఉండాల్సిందన్నారు.
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో భారీ వర్షం కురిసింది. ప్రభుత్వం ఇప్పటికే వరదసాయం ప్రకటించింది. వరదలతో రాజకీయాలు ముడిపెట్టొద్దని చెప్పింది ప్రభుత్వం, పరామర్శల పేరుతో విమర్శలు వద్దని రాజకీయ పార్టీలకు సూచించింది. కానీ కాంగ్రెస్, బీజేపీ ఆల్రడీ హడావిడి చేశాయి. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా పరామర్శలకోసం వెళ్తానంటున్నారు. గతంలో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ వ్యాఖ్యలు చేసిన ఆమె, ఈసారి పరామర్శల తర్వాత ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. పరామర్శలకు ముందు ఆమె చేసిన వ్యాఖ్యలు ఆల్రడీ వైరల్ గా మారాయి.
వరదల్లో చిక్కుకున్న ప్రజలను చూస్తుంటే బాధేస్తోందని అన్నారు గవర్నర్ తమిళిసై. ప్రభుత్వం మరింత మెరుగ్గా ప్రజలకు రక్షణగా ఉండాల్సిందన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలని, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వర్షాలపై కొన్ని రాజకీయ పార్టీలు తనకు మెమొరాండం ఇచ్చాయని, తాను కూడా ప్రభుత్వాన్ని నివేదిక అడిగానని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను త్వరలో పర్యటిస్తానన్నారు గవర్నర్.
పెండింగ్ బిల్లులపై కీలక వ్యాఖ్యలు..
తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారంపై కూడా గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి వ్యతిరేకం కాదంటున్నారామె. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులను వెనక్కి పంపడంపై తన అభ్యంతరాలను క్లియర్ గా తెలిపానని చెప్పారు. వెనక్కి పంపిన బిల్లులపై వివరాలు కావాలని స్పీకర్ ని అడిగానన్నారు తమిళిసై.