Telugu Global
Telangana

గవర్నర్ కోటా కథ ముగిసినట్టేనా..?

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కొత్త ప్రభుత్వం నియామకాలను అడ్డుకోవడం సరికాదని తేల్చి చెప్పింది.

గవర్నర్ కోటా కథ ముగిసినట్టేనా..?
X

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వ్యవహారం సీరియల్ లా కొనసాగింది. గత ప్రభుత్వం గవర్నర్ కి సిఫార్సు చేయడం, గవర్నర్ ఆ ఫైల్ ని తొక్కిపెట్టడం, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం మరో రెండు పేర్లను సిఫారసు చేయడం, వాటికి గవర్నర్ వెంటనే ఆమోదం తెలపడం.. ఈలోగా బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్సీలు కావాల్సిన ఇద్దరూ కోర్టుకెళ్లడం, కోర్టు కొత్త ప్రభుత్వం గెజిట్ ని కొట్టివేయడం.. ఇక్కడి వరకు సాగిన ఈ ఎపిసోడ్ లో చివరకు సుప్రీంకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కొత్త ప్రభుత్వం నియామకాలను అడ్డుకోవడం సరికాదని తేల్చి చెప్పింది. దీంతో కోదండరాం, అమీర్ అలీఖాన్ లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం అయింది.

గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణను బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను చేయాలనుకుంది. కానీ గత గవర్నర్ తమిళిసై.. ఆ ఫైల్ కి అడ్డుపడ్డారు. ప్రభుత్వం చేసిన సిఫారసుకి ఆమె ఆమోదముద్ర వేయలేదు. ఈలోగా ప్రభుత్వం మారడంతో ఆ రెండు ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్ కి బంపర్ ఆఫర్ లా మారాయి. కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను సిఫారసు చేస్తూ గవర్నర్ కి కాంగ్రెస్ ప్రభుత్వం ఫైల్ పంపించింది. బీఆర్ఎస్ ఫైల్ ని తొక్కిపెట్టిన గవర్నర్, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఫైల్ ని వెంటనే ఆమోదించారు. దీంతో కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. అయితే శాసన మండలి చైర్మన్ ఆలస్యం చేయడంతో వారి ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఈలోగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టుకి వెళ్లి వారి ప్రమాణ స్వీకారాలను అడ్డుకున్నారు. అంతే కాదు, వారి నియామకాలకోసం ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ని కూడా హైకోర్టు కొట్టివేసింది. ఇక్కడితో ఈ గొడవ సద్దుమణిగింది అనుకుంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ట్విస్ట్ ఇచ్చింది.

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని చెప్పింది సుప్రీంకోర్టు. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లయిన శ్రవణ్, సత్యనారాయణ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనికి ధర్మాసనం నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్‌, ప్రభుత్వ హక్కులను హరించినట్లు అవుతుందని పేర్కొంది. పిటిషన్‌పై విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది.

First Published:  14 Aug 2024 5:11 PM IST
Next Story