Telugu Global
Telangana

సొంత ఆదాయం పెంచుకున్న తెలంగాణ ప్రభుత్వం

గత ఏడాది ఏప్రిల్-జూన్ (తొలి త్రైమాసికం) నెలల్లో రూ. 20,225 కోట్ల ఆదాయం ఉండగా.. ఈ ఏడాది రూ. 29,212 కోట్లుగా ఉంది. హెచ్ఎండీఏ భూముల అమ్మకం వల్లే ఈ ఏడాది రూ. 6,874 కోట్లు వచ్చింది.

సొంత ఆదాయం పెంచుకున్న తెలంగాణ ప్రభుత్వం
X

తెలంగాణ ప్రభుత్వం సొంత ఆదాయం పెంచుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జూన్ నుంచి క్రమంగా ఆదాయం పెరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం 'కాగ్'కు ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. ఎఫ్ఆర్బీఎం పరిమితి మేరకు తీసుకోవాల్సిన రుణాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. దీంతో కొన్నాళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నిధుల కొరతతో ఇబ్బంది పడుతోంది. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా నిధులు కూడా సరైన సమయానికి అందకపోవడంతో పథకాలు, జీతాలు, అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది.

ఇటీవల ప్రభుత్వ భూముల అమ్మకాన్నిచేపట్టింది. దీనికి తోడు స్టాంపు డ్యూటీ - రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెరిగింది. మరోవైపు మొండి బకాయిల వసూళ్లు కూడా పెరిగాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అదనపు పన్నులు విధించింది. దీంతో జూన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. అందుకే గత నెలలో రైతుబంధుకు రూ. 7 వేల కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేయగలిగినట్లు తెలుస్తుంది.

ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంది. కేంద్రం నుంచి గ్రాంట్లు రాకపోవడం, కొత్త అప్పులు పుట్టకపోవడంతో ఇబ్బందులు పడింది. దీంతో సొంత ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిపెట్టింది. గత ఏడాది ఏప్రిల్-జూన్ (తొలి త్రైమాసికం) నెలల్లో రూ. 20,225 కోట్ల ఆదాయం ఉండగా.. ఈ ఏడాది అది రూ. 29,212 కోట్లుగా ఉంది. హెచ్ఎండీఏ భూముల అమ్మకం వల్లే ఈ ఏడాది రూ. 6,874 కోట్లు వచ్చింది. గత ఏడాది ఈ ఆదాయం కేవలం రూ. 903 కోట్లు మాత్రమే.

ఆర్బీఐ నుంచి అప్పులు, కేంద్రం నుంచి రావల్సిన గ్రాంట్ల రూపంలో గత ఏడాది తొలి త్రైమాసికంలో రూ. 16,391 కోట్లు వచ్చాయి. కానీ ఈ సారి కేవలం రూ. 6,861 కోట్లు మాత్రమే రావడంతో రాష్ట్రం చాలా ఇబ్బంది పడింది. జీఎస్టీ ద్వారా గతేడాది కంటే ఈసారి వసూళ్లు పెరిగాయి. కానీ, ఆ మేరకు కేంద్రం నుంచి వాటా రావడం లేదు. అందుకే సొంత ఆదాయంపై దృష్టి పెట్టింది. పాత లోన్ల రికవరీ వేగం కూడాపెంచింది. గత ఏడాది రూ. 12 కోట్లే వసూళ్లు చేయగా.. ఈసారి రూ. 601 కోట్లకు పెంచింది.

ఆదాయం పెరిగినా.. అంతకు మించిన ఖర్చులు ఉండటంతో మిగులు లేకుండా పోతోంది. ముఖ్యంగా కొత్త పీఆర్సీ ప్రకారం పెంచిన వేతనాలు, వడ్డీల చెల్లింపు కోసం భారీగా ఖర్చు పెడుతోంది. అందుకే రైతు బంధును సక్రమంగా అమలు చేసినా.. పలు రకాల సబ్సిడీలకు మాత్రం కోత పెట్టింది. ఇటీవల పెంచిన మద్యం ధరలు, వాహనాల లైఫ్ ట్యాక్స్, భూముల విలువ, స్టాంప్ డ్యూటీ-రిజిస్ట్రేషన్ చార్జీల ద్వారా ఆదాయం భారీగా పెరిగింది. గ్రీన్ ట్యాక్స్ విధింపు, మొండి బకాయిల వసూళ్లు ఆదాయాన్ని మరింతగా పెంచినట్లు అధికారులు చెప్తున్నారు.

First Published:  29 July 2022 9:07 AM IST
Next Story