Telugu Global
Telangana

ఈ నిర్ణయం అమలైతే.. ఓయూలో ఆ రోడ్డు క్లోజ్..!

వేలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారని, ఈ కారణంగా విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారని మంత్రి కేటీఆర్ కు వీసీ వివరించారు.

ఈ నిర్ణయం అమలైతే.. ఓయూలో ఆ రోడ్డు క్లోజ్..!
X

చదువుల నిలయం, ఉద్యమ కేంద్రంగా ఖ్యాతి గడించిన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ).. మళ్లీ వార్తల్లోకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఓయూ విషయంలో ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వీసీ రవీంద్ర చేసిన అభ్యర్థనకు మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపినట్టుగా వస్తున్న ఈ వార్త ఆసక్తికరంగా మారింది.

అసలు విషయం ఏంటంటే.. మంత్రి కేటీఆర్ ఇటీవల ఓయూ పరిధిలోని నిజాం కాలేజీలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంలో వర్సిటీ వీసీ రవీంద్ర మంత్రి కేటీఆర్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. ఓయూ మీదుగా నగరంలోని కీలక ప్రాంతాలకు వెళ్లేందుకు నిత్యం ఉపయోగిస్తున్న రోడ్డుకు బదులుగా.. మరో మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. తార్నాక నుంచి విద్యానగర్, అంబర్ పేట, అడిక్ మెట్, ఫీవర్ హాస్పిటల్ వరకు రాకపోకలు చేసే రోడ్డు.. ఓయూ మీదుగానే ఉన్న విషయాన్ని మంత్రికి ఆయన వివరించారు.

వేలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారని, ఈ కారణంగా విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారని మంత్రి కేటీఆర్ కు వీసీ వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి.. త్వరలోనే 16 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించి కొత్త లింక్ రోడ్డును అందుబాటులోకి తెస్తామని చెప్పారు. త్వరలోనే పనులు కూడా మొదలుపెట్టిస్తామన్నారు.

అడిక్ మెట్, తార్నాక, అంబర్ పేటను కలిపేలా.. అడిక్ మెట్ ఫ్లై ఓవర్ నుంచి ఈసీఈ డిపార్ట్ మెంట్, ఆంధ్ర మహిళా సభ, ఓయూ ఎన్సీసీ గేట్ ను కలుపుతూ కొత్త లింక్ రోడ్డును అందుబాటులోకి తెస్తామని కేటీఆర్ చెప్పారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. ఓయూ మీదుగా ఆయా ప్రాంతాలకు వెళ్లే లింక్ రోడ్డు మూత పడుతుంది. కేవలం విద్యార్థులకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. అయితే క్లిష్టమైన ఈ ప్రక్రియకు చాలా కాలం పట్టే అవకాశం ఉంది.

First Published:  13 Aug 2023 12:19 PM IST
Next Story