మరో 3 గ్యారంటీలు ఎప్పుడంటే..
ప్రస్తుతం ప్రజాపాలనలో భాగంగా జనం నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. కోట్లల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. 17వ తేదీకల్లా లబ్ధిదారుల సంఖ్య ఎంతో తేల్చుతారు.
ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ సర్కారు ఫోకస్ పెంచింది. త్వరలోనే మరో 3 గ్యారంటీలను అమలు చేయడానికి కసరత్తు మొదలుపెట్టింది. గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే గ్యాస్ సిలిండర్, చేయూత కింద పెన్షన్లు రూ. 4వేలకు పెంపు వంటి హామీలను అమలు చేయడానికి ఆయా శాఖల అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు.
మూడు స్కీములను అమలు చేయడానికి నెలవారీగా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందని సర్కారు ఇప్పటికే లెక్కలు వేసింది. ఆయా శాఖల అధికారుల నుంచి లబ్ధిదారుల సంఖ్య తెప్పించుకుంది. నిధుల ఖర్చుపై ఓ అంచనాకు వచ్చింది. ఒకేసారి మూడు స్కీములను అమలు చేసే క్రమంలో వేర్వేరు గైడ్‌లైన్స్ అవసరమని ప్రభుత్వానికి అధికారులు సూచించారు. అందుకు తగ్గట్టుగానే మూడు స్కీములకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు కానున్నాయి.
ప్రస్తుతం ప్రజాపాలనలో భాగంగా జనం నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. కోట్లల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. 17వ తేదీకల్లా లబ్ధిదారుల సంఖ్య ఎంతో తేల్చుతారు. అప్పుడు స్కీములకు అయ్యే ఖర్చుపై మరింత స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఫిబ్రవరి చివరి వారంలో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ రాబోతోంది. ఆలోగా ఈ మూడు స్కీములను అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే రెండు స్కీములను అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో మూడు స్కీములను అమలు చేసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. స్కీముల అమలునే ప్రచారంలో ప్రధాన అస్త్రంగా వాడాలని యోచిస్తోంది. తద్వారా మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు ప్రత్యర్థి పార్టీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వొచ్చని భావిస్తోంది రేవంత్ సర్కారు.