Telugu Global
Telangana

కేంద్రం అన్యాయం... మౌనమేల రేవంత్..?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 90 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కేంద్రం నుంచి 41 వేల 159 కోట్లు గ్రాంట్‌గా వస్తుందని అంచనా వేసింది. కానీ అందులో ఇప్పటివరకూ 20 శాతం కూడా రాలేదు. ఇంత జరుగుతున్నప్పటికీ రేవంత్ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తుంది.

కేంద్రం అన్యాయం... మౌనమేల రేవంత్..?
X

సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం ఇటీవల ఓట్ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా కేటాయింపులు చేయడాన్ని దక్షిణాది రాష్ట్రాలు నిలదీస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల దగ్గర వసూలు చేసి.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఖర్చు చేయడంపై మండిపడుతున్నాయి. ఇప్పటికే పొరుగున కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం హస్తినలో నిరసన కూడా తెలిపింది. కర్ణాటక దారిలోనే తమిళనాడులోని డీఎంకే సర్కార్, కేరళలోని పినరయి సర్కార్‌ కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేశాయి. ఇక ఏపీ సీఎం జగన్‌ సైతం ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే మనకు వస్తుంది చాలా తక్కువ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్‌ సైతం కేంద్రం వైఖరిని చాలా సార్లు తప్పు పట్టారు.

అయితే కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగినప్పటికీ తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన కూడా కరవైంది. ముఖ్యమంత్రి రేవంత్‌ కేంద్ర బడ్జెట్‌పై పూర్తిగా మౌనం వహించారు. కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్‌ నేతల సహకారం తీసుకున్న తెలంగాణ సర్కార్‌.. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంలో కర్ణాటక కాంగ్రెస్‌తో పాటు పోరాడాల్సింది పోయి.. కనీసం మద్దతు కూడా ప్రకటించలేదు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 90 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కేంద్రం నుంచి 41 వేల 159 కోట్లు గ్రాంట్‌గా వస్తుందని అంచనా వేసింది. కానీ అందులో ఇప్పటివరకూ 20 శాతం కూడా రాలేదు. ఇంత జరుగుతున్నప్పటికీ రేవంత్ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తుంది.

తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి ట్యాక్స్‌గా వెళ్తే తిరిగి వస్తుంది 40 పైసలు మాత్రమే. ఇక ఏపీ నుంచి రూపాయి వెళ్తే 50 పైసలు మాత్రమే తిరిగి వస్తుంది. గత ఐదేళ్లలో దక్షిణాది 5 రాష్ట్రాల నుంచి కేంద్రానికి 22 లక్షల 26 వేల 983 కోట్లు ట్యాక్స్‌ రూపంలో వెళ్లగా.. తిరిగి వచ్చింది మాత్రం 6 లక్షల 42 వేల 295 కోట్లు మాత్రమే. ఇక ఉత్తరాది రాష్ట్రమైన యూపీ నుంచి గత ఐదేళ్లలో 3 లక్షల 41 వేల 817 కోట్లు కేంద్రానికి వెళ్లగా.. ఆ రాష్ట్రానికి మాత్రం 6 లక్షల 91 వేల 375 కోట్లు తిరిగి కేంద్రం ఇచ్చింది. అంటే దక్షిణాది 5 రాష్ట్రాలకు గత ఐదేళ్లలో కేంద్రం ఎంతిచ్చిందో.. అంత కంటే ఎక్కువగా ఒక్క యూపీకే కేటాయించింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి రూపాయి కేంద్రానికి వెళ్తే తిరిగి 2 రూపాయల 20 పైసలు ఆ రాష్ట్రానికి కేంద్రం ఇస్తుంది. ఈ అన్యాయంపై దక్షిణాది రాష్ట్రాలు ఒక్కతాటిపై పోరాడాల్సిన సమయమిది. కానీ తెలంగాణ సీఎం రేవంత్ నుంచి ఇప్పటివరకూ ఒక్క మాట రాకపోవడం ఆశ్చర్యం.

First Published:  9 Feb 2024 11:27 AM IST
Next Story