అన్నపూర్ణ సూపర్ హిట్
373 కేంద్రాల్లో నడుస్తున్న అన్నపూర్ణ భోజనం పథకం ద్వారా ఇప్పటి వరకు 10కోట్ల 11 లక్షల భోజనాలు పంపిణీ చేశారు. దీంతో దేశంలోనే అతిపెద్ద భోజన పథకంగా అన్నపూర్ణ భోజన పథకం నిలిచింది.
హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నపూర్ణ భోజన పథకం మరో మైలురాయిని అధిగమించింది. ఈ పథకంలో భాగంగా ఐదు రూపాయలకే ప్రభుత్వం భోజనం అందిస్తోంది. ప్రతి ఒక్కరి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం.. 2014లో ఈ పథకాన్ని ప్రారంభించింది. పేదలు, వలస కార్మికులు, విద్యార్థులు, చిరుద్యోగులకు ఈ పథకం గొప్ప ఊరటగా నిలిచింది.
373 కేంద్రాల్లో నడుస్తున్న అన్నపూర్ణ భోజనం పథకం ద్వారా ఇప్పటి వరకు 10కోట్ల 11 లక్షల భోజనాలు పంపిణీ చేశారు. దీంతో దేశంలోనే అతిపెద్ద భోజన పథకంగా అన్నపూర్ణ భోజన పథకం నిలిచింది. ఇప్పటి వరకు ఈ పథకంపై ప్రభుత్వం 190 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ పథకం ద్వారా రోజూ 45వేల మంది భోజనం చేస్తున్నారు. ఒక్కొక్కరికీ 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల పప్పు, 15 గ్రాముల పచ్చడి వడ్డిస్తుంటారు.
ఈ పథకం నిర్వాహణకు రోజుకు 16 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కరోనా సమయంలోనూ పేదలకు ఈ పథకం పెద్ద ఊరటగా నిలిచింది. హరేకృష్ణ మూవ్‌మెంట్ సహకారంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. భోజన కేంద్రాల్లో టేబుళ్లు, కుర్చీలు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యంతో ప్రైవేట్ హోటళ్లకు దీటుగా వీటిని నిర్వహిస్తున్నారు.