Telugu Global
Telangana

ప్రసూతిల్లో రికార్డు నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు

గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, ప్రసూతి సమయంలో కేసీఆర్ కిట్లు, ఇంటి నుంచి ఆసుపత్రికి తీసుకొని వెళ్లి, తిరిగి తీసుకొని రావడానికి అమ్మ ఒడి వాహనాలను ఏర్పాటు చేశారు.

ప్రసూతిల్లో రికార్డు నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు
X

తెలంగాణలోని సర్కారు ఆసుపత్రులు మరోసారి రికార్డు సృష్టించాయి. జూలై నెలలో అత్యధికంగా 72 శాతం డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లోనే జరిగాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 30 శాతం డెలివరిలు మాత్రమే నమోదయ్యేవి. అయితే సీఎం కేసీఆర్ వైద్యరంగంలో అనేక మార్పులు తీసుకొని వచ్చారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, ప్రసూతి సమయంలో కేసీఆర్ కిట్లు, ఇంటి నుంచి ఆసుపత్రికి తీసుకొని వెళ్లి, తిరిగి తీసుకొని రావడానికి అమ్మ ఒడి వాహనాలను ఏర్పాటు చేశారు.

తల్లిబిడ్డల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతీ దశలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. గర్భిణి మహిళలను పర్యవేక్షించడానికి ఆశా వర్కర్లకు తగిన శిక్షణ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ చేయించుకునే వారి సంఖ్య పెరిగింది. 9 ఏళ్లు తిరిగేసరికి ఇప్పుడు 72 శాతం ప్రసూతిలు సర్కారు దవఖానల్లోనే జరుగుతున్నాయి. దేశంలోనే అత్యధిక డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుతున్న రాష్ట్రంగా తెలంగాణ మరోసారి రికార్డు సృష్టించింది.

ఏప్రిల్ నెలలో కేంద్రం ప్రకటించిన జాబితాలో తెలంగాణ 70 శాతం డెలివరీలతో రికార్డు సృష్టించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 72 శాతానికి చేరుకోవడం గమనార్హం. రెండు నెలల క్రితం కేంద్రం ప్రకటించిన జాబితాలో రాష్ట్రంలోని 4 జిల్లాలు 80 శాతానికి పైగా డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిపినట్లు తెలిసింది. సంగారెడ్డిలో 87 శాతం, నారాయణ్‌పేట్ 83 శాతం, మెదక్ 82 శాతం, గద్వాల్ 81 శాతం డెలివరీతో టాప్ 4లో నిలిచాయి.

తాజాగా డెలివరిల్లో సరికొత్త రికార్డు నెలకొల్పినందుకు ప్రభుత్వ వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.


First Published:  10 Aug 2023 3:15 PM IST
Next Story