Telugu Global
Telangana

సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష.. నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

పేపర్-1ని బీఈడీ, డీఈడీ అర్హత కలిగిన వారు రాసే అవకాశం ఉంటుంది. ఇక పేపర్-2 కేవలం బీఈడీ వారికి మాత్రమే నిర్వహిస్తారు. అంటే బీఈడీ అర్హత కలిగిన వారు రెండు పేపర్లు కూడా రాసుకునే వెసులు బాటు ఉంటుంది.

సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష.. నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
X

బీఈడీ, డీఈడీ చదివి.. ఉపాధ్యాయ‌ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 15న టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి (ఆగస్టు 2) నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నది. సెప్టెంబర్ 15నే టెస్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి.

పేపర్-1ని బీఈడీ, డీఈడీ అర్హత కలిగిన వారు రాసే అవకాశం ఉంటుంది. ఇక పేపర్-2 కేవలం బీఈడీ వారికి మాత్రమే నిర్వహిస్తారు. అంటే బీఈడీ అర్హత కలిగిన వారు రెండు పేపర్లు కూడా రాసుకునే వెసులు బాటు ఉంటుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం టెట్ పరీక్ష నిర్వహణకు ఆమోదం తెలిపింది. దీంతో పరీక్ష నిర్వహణకు ఎన్సీఈఆర్టీ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. టెట్ పరీక్ష ప్రతిపాదనలు పరిశీలించిన విద్యా శాఖ.. ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాష్ట్రంలో 1.5 లక్షల మంది డీఎడ్, 4.5 లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు ఉన్నట్లు తాజాగా అంచనా వేశారు. 2017లో టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 మంది టీచర్లను భర్తీ చేశారు. ఒక సారి టెట్ పరీక్ష రాస్తే దానికి 7 ఏళ్ల వ్యాలిడిటీ ఉండేది. కాగా, రెండేళ్ల క్రితం ఈ వ్యాలిడిటీని జీవిత కాలం పొడిగించారు. అయితే ఇటీవల డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన వారు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో కొత్త వారి కోసం తాజా నోటిఫికేషన్ ఉపయోగపడనున్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు 2 లక్షల మంది ఉన్నారు. వారితో పాటు కొత్తగా మరో 20 వేల మంది డీఎడ్, బీఎడ్ పూర్తి చేశారు. వారికోసం ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.

టెట్ దరఖాస్తులు ఆగస్టు 2 నుంచి ఆగస్టు 16 వరకు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 15న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ పరీక్షకు రూ.400 ఫీజుగా నిర్ణయించారు.

First Published:  1 Aug 2023 2:51 PM IST
Next Story