Telugu Global
Telangana

సీబీఐని నిలువరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో

ఇప్పటికే బెంగాల్‌ లాంటి రాష్ట్రాలు కూడా సీబీఐకి సాధారణ అనుమతిని రద్దు చేశాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని తాజాగా బీజేపీ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో సీబీఐకి బ్రేకులు వేసింది రాష్ట్ర ప్రభుత్వం.

సీబీఐని నిలువరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో
X

సీబీఐ ఎంట్రీపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో ఏ కేసునైనా నేరుగా, స్వేచ్ఛ‌గా దర్యాప్తు చేసేందుకు ఇది వరకు ఇచ్చిన సాధారణ అనుమతిని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా కేంద్రంలోని బీజేపీ పావులు కదుపుతుండటంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.

తనకు గిట్టని పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు సీబీఐని బీజేపీ ప్రయోగిస్తోందన్న విమర్శలున్నాయి. ఇప్పటికే బెంగాల్‌ లాంటి రాష్ట్రాలు కూడా సీబీఐకి సాధారణ అనుమతిని రద్దు చేశాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని తాజాగా బీజేపీ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో సీబీఐకి బ్రేకులు వేసింది రాష్ట్ర ప్రభుత్వం.

సీబీఐని నిలువరిస్తూ ఆగస్ట్ 31నే జీవో నెంబర్‌ 51ని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పుడు దాన్ని బహిర్గతం చేసింది. ఇకపై సీబీఐ నేరుగా రాష్ట్రంలోకి వచ్చి కేసులు దర్యాప్తు చేయడానికి వీలుకాదు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకునే రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. లేదా కోర్టు ఆదేశాలున్న కేసులను మాత్రమే దర్యాప్తు చేయవచ్చు.

గతంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కూడా సీబీఐని నిలువరించేలా ఇదే తరహాలో జీవో ఇచ్చారు. అలా సీబీఐని అడ్డుకునే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం సీబీఐకి సాధారణ అనుమతిని రద్దు చేయగా ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక తిరిగి సాధారణ అనుమతిని ఇచ్చారు.

First Published:  30 Oct 2022 11:58 AM IST
Next Story