తెలంగాణలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న పలు ఫార్మా కంపెనీలు
ఆదివారం ఫాక్స్ లైఫ్ సైన్సెస్, కార్నింగ్ ఇన్‌కార్పొరేటెడ్, ఎస్‌జీడీ ఫార్మా వంటి కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఏసియా 20వ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సు వల్ల తెలంగాణకు భారీగా పెట్టుబడులు కూడా వచ్చాయి. ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి, విస్తరించడానికి అనేక ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆదివారం ఫాక్స్ లైఫ్ సైన్సెస్, కార్నింగ్ ఇన్‌కార్పొరేటెడ్, ఎస్‌జీడీ ఫార్మా వంటి కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి.
అమెరికాకు చెందిన ఫాక్స్ లైఫ్ సైన్సెస్ కంపెనీ తెలంగాణలో సింగిల్ యూజ్ టెక్నాలజీకి సంబంధించి సామర్థ్యాల విస్తరణకు రూ.200 కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పింది. ఇది వరకే ఈ సంస్థకు తెలంగాణలో వేర్‌హౌస్, లాబొరేటరీ ప్రొడక్ట్స్ కోసం వైట్ రూమ్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్లాస్-6 క్లీన్ రూమ్‌ను ప్రారంభించింది. తాజాగా విస్తరణ కోసం మరో రూ.200 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫాక్స్ లైఫ్ సైన్సెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏక్‌నాథ్ కులకర్ణి చెప్పారు.
పర్టిక్యులేట్ మెటీరియల్స్‌కు సంబంధించిన సాంకేతిక, శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిచే ప్రపంచ అగ్రగామి సంస్థ సర్ఫేస్ మెజర్‌మెంట్స్ సిస్టమ్స్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ రెండు మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నది. ఈ సంస్థ అధునాతన క్యారక్టరైజేషన్ ల్యాబొరేటరీస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు రాబోయే మూడేళ్లలో మరో మూడు మిలియన్ డాలర్ల పెట్టుబడి కూడా పెట్టనున్నట్లు వెల్లడించింది.
బ్రిటన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ప్రముఖ టెక్ బయో ప్లాట్‌ఫామ్ జినోమిక్స్ కూడా హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు విస్తరించనున్నట్లు ప్రకటించింది. కొన్నేళ్ల కిందట 20 మంది సిబ్బందితో ప్రారంభించిన ఈ కంపెనీ ఇవ్వాళ బయో ఇన్ఫర్మేటిక్స్, డాటా అనలిటిక్స్‌లో 61 మందితో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిపింది. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెడతామని స్పష్టం చేసింది.
కార్నింగ్ ఇన్‌కార్పొరేటెడ్, ఎస్‌జీడీ ఫార్మా హైదరాబాద్ కేంద్రంగా ఫార్మాస్యుటికల్ ప్యాకేజింగ్ గ్లాస్ ఉత్పత్తుల కోసం తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కంపెనీకి చెందిన ప్రతినిధులు బయో ఏసియా 2023 సందర్భంగా కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాళ్లు రూ.500 కోట్లకు పైగా ఈ ఫెసిలిటీ సెంటర్ కోసం పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఒక్క రోజే రూ.700 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నది.
Delighted to announce that @Corning and @SGDPharma will establish a top-notch facility for pharmaceutical packaging glass production in Telangana! They will invest more than ₹ 500 crores #pharmaceuticals #packaging #TelanganaleadsLifeSciences pic.twitter.com/gHVcbs7cMe
— KTR (@KTRBRS) February 26, 2023