సెర్ప్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ నుంచి పే స్కేల్ అమలు
ఐకేపీలో పని చేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అమలు చేస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.
తెలంగాణలోని సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ - పేదరిక నిర్మూలన సంస్థ) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై సెర్ప్ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వేతనాలు అందజేయనున్నట్లు తెలిపింది. సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ప్ ఉద్యోగుల కనిష్ట పే స్కేల్ రూ.19,000 నుంచి రూ.58,850 వరకు.. గరిష్ట పే స్కేల్ రూ.51,320 నుంచి రూ.1,27,310గా నిర్ణయించింది. సెర్ప్ ఉద్యోగులకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి పే స్కేల్ వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా.. ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఐకేపీలో పని చేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అమలు చేస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. పేదరిక నిర్మూలనలో, డ్వాక్రా మహిళా సంఘాలకు నిధులు అందించడంలో విశేష సేవలు చేస్తున్న సెర్ప్ ఉద్యోగులకు తప్పకుండా పే స్కేల్ వర్తింప చేస్తామని సీఎం పేర్కొన్నారు. సెర్ప్‌లోని 3,978 మంది ఉద్యోగుల ఈ పే స్కేల్‌ను అందుకోనున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం పే స్కేల్ అమలు చేయనుండటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుకు ధన్యవాదాలు తెలియ జేశారు.
కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు ఇలా ఉండబోతున్నాయి...
మండల సమాఖ్య కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ : రూ.19,000 - రూ.58,850
మండల సమాఖ్య కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ (MRPs): రూ.19,000 - రూ.58,850
మండల బుక్ కీపర్స్ : రూ.22,240 - రూ.67,300
కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ : రూ.24,280 - రూ.72,850
అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్స్ : రూ.32,810 - రూ.96,890
డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ : రూ.42,300 - రూ.1,15,270
ప్రాజెక్ట్ మేనేజర్స్ : రూ.51,230 - రూ.1,27,310
డ్రైవర్స్ : రూ.22,900 - రూ.69,150
ఆఫీస్ సబార్డినేట్స్ : రూ.19,000 - రూ.58,850
అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ సెక్రటరీస్ : రూ.24,280 - రూ.72,850
Happy to inform that orders issued for fixation of Pay Scales to SERP Employees, Field, Ministerial & Supporting staff and Mandal Samakhya Community Coordinators. As promised by Hon’ble #CMKCR Garu in Assembly. The long standing issue of SERP employees is solved. pic.twitter.com/ZRfpA8Idjs
— Harish Rao Thanneeru (@BRSHarish) March 18, 2023