Telugu Global
Telangana

తెలంగాణ: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

5,000 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో లైబ్రరీలను స్థాపించడమే కాకుండా, 998 ప్రాథమికోన్నత పాఠశాలలతో సహా 2,732 ఉన్నత పాఠశాలల్లో పూర్తి స్థాయి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం
X

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

5,000 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో లైబ్రరీలను స్థాపించడమే కాకుండా, 998 ప్రాథమికోన్నత పాఠశాలలతో సహా 2,732 ఉన్నత పాఠశాలల్లో పూర్తి స్థాయి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది.

లైబ్రరీల ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ ఒక్కో లైబ్రరీకి 120 పుస్తకాలు అందించాలని నిర్ణయించింది. నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బిటి) నుంచి ఈ పుస్తకాలను కొనుగోలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

5,000 ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేసిన తర్వాత, ఈ పాఠశాలలకు 6 లక్షల పుస్తకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖకు అనుమతినిచ్చింది. దీని కోసం ఇటీవల ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణాలయం ద్వారా ఈ పుస్తకాలను ముద్రించే ప్రక్రియను ప్రారంభించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసే గ్రంథాలయాల్లో విద్యార్థుల పఠన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడే పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు.

కోవిడ్-19 మహమ్మారి కాలంలో టెలివిజన్ సెట్లు, కంప్యూటర్‌లపై ఆధారపడిన డిజిటల్/ఆన్‌లైన్ లలో క్లాసెస్ జరిగాయి. ఇప్పుడు కోవిడ్ ముప్పు తొలిగిపోవడంతో విద్యార్థులు తిరిగి పాఠశాలలకు వస్తున్నారు. అయితే చాలా మంది విద్యార్థులు చదవడం, రాయడం విషయంలో ఇబ్బందులకు గురవుతున్నట్టు విద్యాశాఖ గుర్తించింది. పాఠశాల విద్యార్థులలో ఈ నైపుణ్యాలను పునరుజ్జీవింపజేయడానికి, మరింత‌ మెరుగుపరచడానికి డిపార్ట్‌మెంట్ 'తొలిమెట్టు', అనే ఫౌండేషన్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో వివిధ రకాల పుస్తకాలతో గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. లైబ్రరీలు ప్రారంభమైన తర్వాత, పాఠశాలలకు కనీసం 15 నిమిషాల పాటు లైబ్రరీ పీరియడ్ నిర్వహించాలని ఆదేశించారు.

లైబ్రరీలో అందుబాటులో ఉంచిన ఇతర పుస్తకాలతో పాటు సబ్జెక్టు పుస్తకాలను విద్యార్థులు చదివేలా చూడాలని విద్యాశాఖ ఉపాధ్యాయులను ఆదేశించింది. విద్యార్థులు ప్రాథమిక సామర్థ్య స్థాయిలను సాధించేలా చూడాలని కూడా వారిని ఆదేశించారు.

First Published:  15 Jan 2023 7:14 AM IST
Next Story