Telugu Global
Telangana

కడెం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి?

కడెం పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండటంతో ఎంత మేరకు ఇన్‌ఫ్లో వస్తోందో తొలుత అంచనా వేయడంలో ఇంజనీర్లు విఫలమయ్యారు. దీంతో ఒక్కసారిగా వరద పెరిగింది.

కడెం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి?
X

తెలంగాణలో భారీ వర్షాలు పడిన సమయంలో భద్రాచలం వరదల కంటే ముందు 'కడెం ప్రాజెక్టు' భద్రతపైనే తీవ్రంగా చర్చ జరిగింది. ఉమ్మడి అదిలాబాద్‌లో కడెం నదిపై ఉన్న ఈ ప్రాజెక్టుకు ఒకే సారిగా 5 లక్షల క్యూసెక్కులకు మించిన వరద రావడంతో ప్రమాదకరంగా మారింది. ప్రాజెక్టు డిస్పాచ్ కెపాసిటీ కంటే ఎక్కువగా వరద రావడం.. ఒక గేటు తెరవడానికి వీలు కాకపోవడంతో భారీగా బ్యాక్ వాటర్ నిలిచిపోయింది. కడెం పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండటంతో ఎంత మేరకు ఇన్‌ఫ్లో వస్తోందో తొలుత అంచనా వేయడంలో ఇంజనీర్లు విఫలమయ్యారు. దీంతో ఒక్కసారిగా వరద పెరిగింది.

కడెంకు వచ్చిన భారీ వరద కారణంగా సమీప గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం జరుగకుండానే అందరూ వరదల నుంచి తప్పించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఆధునీకరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అత్యున్నత స్థాయి టెక్నికల్ టీమ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆ బృందం సోమవారం ప్రాజెక్టును సందర్శించింది. ప్రాజెక్టు ఆధునీకరణకు చేపట్టాల్సిన చర్యలను వారు సూచించనున్నారు.

వరద సమయంలో ప్రాజెక్టు గేట్ల వద్ద భారీగా చెట్లు, చెత్త కొట్టుకొని వచ్చి స్ట్రక్ అయ్యింది. అక్కడి 18 గేట్లు, తెగిన కౌంటర్ వేటర్లు, గేట్ ఆపరేటింగ్ మోటార్లను పరిశీలించారు. అలాగే మైసమ్మ గుడి సమీపంలో ప్రాజెక్టుకు పడిన గండిని కూడా పరిశీలించారు. దాదాపు మూడు గంటల పాటు ఈఎన్‌సీ విభాగానికి చెందిన ఓ అండ్ ఆర్ ఈఈ విద్యానంద్, డీఈ కరుణాకర్, రిటైర్డ్ ఈఈ సురేందర్, జేఈ సంగీత్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పరిశీలించారు.

వరదల సమయంలో గేట్లపై నుంచి వరద పొంగి ప్రవహించింది. దీంతో ఇప్పుడు గేట్లను ఆపరేట్ చేయడం వీలులేదని తేల్చారు. ఇప్పుడు అలా చేస్తే తడిచిన మోటార్లు కాలిపోయే ప్రమాదం ఉందని తేల్చారు. కొద్ది రోజులు సమయం తీసుకొని.. మోటార్లు ఆరిపోయాయని నిర్ణయించుకున్నాక ఆన్ చేయాలని సూచించారు. అయితే.. ఆ సమయంలో ఎన్ని గేట్లు పని చేస్తాయో చెప్పలేమన్నారు. గేట్లు అన్నీ తెరిచే ఉంచడంతో ఇప్పుడు ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజ్ లెవెల్‌కు చేరుకున్నది. వచ్చిన నీరంతా నేరుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరిలో కలుస్తున్నది. కడెం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకోవల్సిన చర్యల నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి పంపనున్నట్లు టెక్నికల్ టీమ్ చెప్పింది.

కొట్టుకొని పోయిన ప్రాజెక్టునే కట్టారు..

కడెం ప్రాజెక్టును నిజాం పరిపాలనలో నిర్మించారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బోథ్ సమీపంలోని పొచెర జలపాతం, ఇచ్చోడ వద్ద ఉన్న కుంటాల జలపాతాలు కలవడంతో కడెం నది ప్రారంభమవుతుంది. 2500 చదరపు కిలోమీటర్ల క్యాచ్ మెంట్ ఏరియాలో 90 శాతానికి పైగా అటవీ ప్రాంతమే. కడెం ప్రాజెక్టును తొలుత 5.5 టీఎంసీల స్టోరేజీతో 9 గేట్లు ఏర్పాటు చేసి కట్టారు. దీని డిస్పాచ్ కెపాసిటీ 2.5 లక్షల క్యూసెక్కులు. అయితే 1958 అగస్టులో భారీ వరదలకు ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. అప్పట్లో 5 లక్షల క్యూసెక్కులకు మించిన వరద వచ్చి ఉంటుందని అంచనా వేశారు. డిస్పాచ్ కెపాసిటీ కంటే రెట్టింపు వరద రావడంతో ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. బ్రీచ్ సెక్షన్ వద్ద డిటోనేటర్‌తో ఎర్త్ డ్యామ్‌ను పేల్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో డ్యామ్ కొట్టుకొని పోయింది.

ఆ తర్వాత ప్రాజెక్టు ఎత్తును 1.20 మీట్లర్ల ఎత్తును పెంచి.. 7.60 టీఎంసీల కెపాసిటీతో 1969లో పునర్‌నిర్మించారు. పాత గేట్లతో పాటు మరో 9 కొత్త గేట్లను పెట్టారు. 3.28 లక్షల క్యూసెక్కుల డిస్పాచ్ కెపాసిటీతో నిర్మించారు. అయితే 1995లో వచ్చిన వరదలకు డ్యామ్ రెండు గేట్లు కొట్టుకొని పోయాయి. ఆ తర్వాత వాటిని బాగు చేశారు. తాజాగా వచ్చిన వరదలకు మాత్రం డ్యామ్‌కు డ్యామేజ్ ఏమీ కాకపోయినా.. గేట్లను మూయలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో కడెంను మరింతగా ఆధునీకరించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

First Published:  19 July 2022 4:30 AM GMT
Next Story