Telugu Global
Telangana

తెలంగాణలో 231 మంది ఖైదీలకు క్షమాభిక్ష

విడుదల కానున్న ఖైదీలు ఒక్కొక్కరు రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని, 3 నెలలకోసారి జిల్లా ప్రొబేషన్‌ అధికారి ఎదుట హాజరు కావాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.

తెలంగాణలో 231 మంది ఖైదీలకు క్షమాభిక్ష
X

తెలంగాణలో సత్ప్రవర్తన కింద ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్‌ కార్యాలయం ఆమోదం తెలపడంతో 231 మంది ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో బుధవారం నాడు వీరంతా విడుదల కానున్నారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హోంమంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీ అందుకు అర్హత ఉన్న 213 మంది ఖైదీలతో కూడిన జాబితాను కూడా రూపొందించింది. అయితే సాంకేతిక కారణాలతో వారి విడుదలకు అప్పట్లో ఉత్తర్వులు విడుదల కాలేదు. తాజా ప్రతిపాదనల ప్రకారం మరో 18 మంది విడుదలకు అర్హత లభించింది. వారితో కలిపి మొత్తం 231 మందితో జాబితాను రూపొందించగా, గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

విడుదల కానున్న ఖైదీలు ఒక్కొక్కరు రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని, 3 నెలలకోసారి జిల్లా ప్రొబేషన్‌ అధికారి ఎదుట హాజరు కావాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. విడుదల కానున్న ఖైదీలందరికీ తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని గవర్నర్‌ కార్యాలయం సూచించినట్లు తెలుస్తోంది. వీరికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంక్‌ ల లాంటి చోట్ల ఉపాధి కల్పించనున్నారు.

2016లో తొలిసారిగా ఖైదీలను విడుదల చేశారు. రెండోసారి 2020 అక్టోబరు 2న 141 మందిని విడుదల చేశారు. 2022లో 150 మందిని విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినా పలు కారణాలతో ఆమోదం లభించలేదు. ఈ ఏడాది జనవరిలోనే విడుదలకు జైళ్ల శాఖ జాబితా తయారు చేసినప్పటికీ తాజాగా మార్గం సుగమమైంది.

First Published:  3 July 2024 7:13 AM IST
Next Story