Telugu Global
Telangana

వీఐపీ స్టిక్కర్లపై ప్రభుత్వం ఫోకస్.. ప్రక్షాళనకు రంగం సిద్ధం

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ అధికారులు జారీ చేసిన స్టిక్కర్లు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. పలువురు అనధికార వ్యక్తులు ఇలాంటి స్టిక్కర్లను సంపాదించి దర్జాగా తిరుగుతున్నట్లు గుర్తించారు.

వీఐపీ స్టిక్కర్లపై ప్రభుత్వం ఫోకస్.. ప్రక్షాళనకు రంగం సిద్ధం
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వీఐసీ స్టిక్కర్లు ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చే వీఐపీ స్టిక్కర్లు దుర్వినియోగం అవుతుండటంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు వాహనాలను అనుమతించడానికి, టోల్ గేట్ల వద్ద ఫ్రీగా వదిలేయడానికి ఈ స్టిక్కర్లు ఉపయోగపడతాయి. కానీ ఇటీవల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వాహనాలకు కాకుండా సాధారణ వ్యక్తుల వాహనాలకు ఈ స్టిక్కర్లు దర్శనం ఇవ్వడం వివాదానికి కారణమవుతున్నాయి.

ప్రతీ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం మూడు స్టిక్కర్లు ఇస్తుంది. అవి పాడైపోతే మళ్లీ రిక్వెస్ట్ చేస్తే అదనంగా రెండు స్టిక్కర్లు ఇస్తుంది. అలాగే ఎంపీలకు పార్లమెంట్ అధికారులు ఇలాంటి స్టిక్కర్లు ఇస్తుంటారు. కాగా, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ అధికారులు జారీ చేసిన స్టిక్కర్లు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. పలువురు అనధికార వ్యక్తులు ఇలాంటి స్టిక్కర్లను సంపాదించి దర్జాగా తిరుగుతున్నట్లు గుర్తించారు.

కొన్నాళ్ల క్రితం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనం ఓ మహిళను ఢీ కొట్టగా.. చేతిలో ఉన్న పాప కింద పడి చనిపోయింది. ఈ విషయం రాజకీయంగా దుమారం రేపింది. ఢీ కొట్టిన వాహనానికి ఉన్న స్టిక్కర్ బోధన్ ఎమ్మెల్యే షకీల్‌దిగా అధికారులు గుర్తించారు. అయితే ఆ వాహనంతో తనకు సంబంధం లేదని.. అనుకోకుండా స్టిక్కర్ మిస్ అయ్యిందని ఆయన చెప్పారు. దీనిపై పలు విమర్శలు రావడంతో.. అది తన బంధువుదని ఆయన ఒప్పుకున్నారు. వీఐపీ స్టిక్కర్లున్న వాహనాలు రాష్ట్రంలో పలు చోట్ల ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. తీరా ఎంక్వైరీ చేస్తే సదరు వాహనం ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు చెందినది కాదని తేలాయి.

తాజాగా మంత్రి మల్లారెడ్డి వీఐపీ స్టిక్కర్ కూడా వివాదంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు బడాబాబులను మచ్చిక చేసుకొని క్యాసినోలు నిర్వహిస్తున్న చికోటి ప్రవీణ్ కుమార్ అనుచరుడు బోయినపల్లి మాధవరెడ్డి కారుకు వీఐపీ స్టిక్కర్ ఉన్నది. ఇది మంత్రి మల్లారెడ్డికి చెందినట్లు అధికారులు తేల్చారు. మల్లారెడ్డిపై తీవ్రమైన విమర్శలు రావడంతో.. ఆ స్టిక్కర్ మూడు నెలల క్రితం పారేశానని.. అది ఎవరో పెట్టుకుంటే తనకేమి సంబంధం అని వాదించారు.

కొంత మంది ప్రజా ప్రతినిధులు వీఐపీ స్టిక్కర్లు పాడవక పోయినా అదనంగా రెండు స్టిక్కర్లు తీసుకొని అనుచరులకు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే/ఎమ్మల్సీలకు ఇస్తున్న స్టిక్కర్లు అసలు ఏ వాహనాలకు ఉపయోగిస్తున్నారన్న డేటా అధికారుల వద్ద లేదు. ఈ స్టిక్కర్ల వ్యవహారం సీఎం కేసీఆర్ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తున్నది. వెంటనే దీన్ని పూర్తి ప్రక్షాళన చేయాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది.

తెలంగాణలో దాదాపు 5వేల వీఐపీ స్టిక్కర్లను అధికారులు జారీ చేసినట్లు సమాచారం. ఉన్న వీఐపీల కంటే అదనంగా చాలా స్టిక్కర్లు ఇచ్చారు. వాటిలో చాలా వరకు పక్కదోవ పట్టాయి. దీంతో ఇకపై స్టిక్కర్లను జారీ చేయాలంటే.. అవి ఏ వాహనాలకు వినియోగిస్తారో రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా నమోదు చేయాలని నిర్ణయించారు. వీఐపీ స్టిక్కర్ గడువు ముగిస్తే.. వెంటనే దాన్ని పూర్తిగా చించేసి.. కొత్త స్టిక్కర్లను వాడాలని ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. ఒక వేళ స్టిక్కర్లు పోతే తప్పకుండా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని.. ఆ తర్వాతే కొత్తవి జారీ చేస్తామని అధికారులు అంటున్నారు. త్వరలోనే వీఐవీ స్టిక్కర్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయనున్నట్లు తెలుస్తున్నది.

First Published:  29 July 2022 1:35 PM GMT
Next Story