Telugu Global
Telangana

సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల వాయిదాకు తెలంగాణ సర్కార్ మొగ్గు?

కేంద్ర ప్రభుత్వం మాత్రం అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతోంది. కేంద్ర కార్మిక శాఖ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది.

సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల వాయిదాకు తెలంగాణ సర్కార్ మొగ్గు?
X

సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలు వాయిదా వేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోందా? కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయానికి ఓకే చెప్తున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. సింగరేణి ఎన్నికల విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వం వాయిదా వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి అక్టోబర్ నెలలో సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటం, షెడ్యూల్ వెలువడుతుందనే అంచనాల మేరకు కార్మిక సంఘ ఎన్నికలు వాయిదా వేయడమే మంచిదని ప్రభుత్వం భావిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం మాత్రం అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతోంది. కేంద్ర కార్మిక శాఖ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే సింగరేణి ప్రాంతంలోని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నారని.. ఇలాంటి సమయంలో సింగరేణి ఎన్నికలు నిర్వహించడం కష్టం అవుతుందని ప్రభుత్వం వాదిస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచే సింగరేణి ఎన్నికల విషయంలో కేంద్ర కార్మిక శాఖ ఒత్తిడి చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఎన్నికలకు సంబంధించిన సమావేశాలు కూడా నిర్వహించింది. అయితే సింగరేణి యాజమాన్యం మాత్రం ఎన్నికల వాయిదాను కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. మే, జూన్ నెలలు సింగరేణికి చాలా కీలకమైన సమయం అని, అప్పుడే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి ఉంటుందని హైకోర్టుకు యాజమాన్యం తెలిపింది. దీంతో సింగరేణి ఎన్నికలు అక్టోబర్ లోగా నిర్వహించాలంటూ కేంద్ర కార్మిక శాఖకు హైకోర్టు సూచించింది.

ప్రస్తుతం సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గుర్తింపు సంఘంగా ఉన్నది. గత ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఎక్కువ ప్రాంతాల్లో గెలిచి.. గుర్తింపు సంఘంగా నిలిచింది. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతం 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తరించి ఉన్నది. సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు ఒక విధంగా ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రీఫైనల్ భావిస్తుంటారు. ఇక్కడ గెలుపొందితే తప్పకుండా ఆయా పార్టీలే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని అంచనా వేసుకుంటారు.

సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలే ఈ 13 నియోజకవర్గాల్లో మెజార్టీ ఓటర్లుగా ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగానే మారాయి. బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘంతో పాటు వామపక్షాల ట్రేడ్ యూనియన్లు, కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ కూడా ఈ ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నాయి. సింగరేణి ఎన్నికల్లో సత్తా చాటితే అసెంబ్లీ ఎన్నికలకు మరింత ఉత్సాహం వస్తుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.

అక్టోబర్ 28 కార్మిక సంఘ ఎన్నికల జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 22న వెలువడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్నది. అయితే ఈ లోపే సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అవసరం అయితే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే ఆలోచనలో కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ స్టే ఇవ్వకపోతే మాత్రం అక్టోబర్ చివరి నాటికి ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్నది.

First Published:  15 Sept 2023 8:30 AM IST
Next Story