కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం మరింత ఆలస్యం.. కారణం అదేనా?
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతితో ఓపెన్ చేయాలని భావించారు. ఈ మేరకు సంప్రదింపులు జరిపినా.. ఈసీఐ అందుకు ఒప్పుకోలేదు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.610 కోట్ల వ్యయంతో సాగర తీరాన కొత్త సచివాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త సెక్రటేరియట్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. జనవరిలోనే ఈ కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే కొన్ని పనులు పెండింగ్ ఉండటంతో.. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నాడు ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే అనుకోకుండా ఫిబ్రవరి 9న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతితో ఓపెన్ చేయాలని భావించారు. ఈ మేరకు సంప్రదింపులు జరిపినా.. ఈసీఐ అందుకు ఒప్పుకోలేదు. దీంతో సెక్రటేరియట్ ఓపెనింగ్‌తో పాటు భారీ బహిరంగ సభను కూడా వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం జరిగి ఉంటే.. కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యుటీ సీఎం తేజశ్వి యాదవ్, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్‌తో పాటు ఇతర ప్రముఖులు హాజరు కావల్సి ఉన్నది. అదే రోజు పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ రెండు కార్యక్రమాలు ఎన్నికల కోడ్ కారణంగా రద్దయ్యాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చ్ 16 వరకు అమలులో ఉండనున్నది. దీంతో ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు సచివాలయ భవనాన్ని ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కొత్త సెక్రటేరియట్‌కు రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ పేరు పెట్టినందున.. ఆ రోజైతే సబబుగా ఉంటుందని కేసీఆర్ భావించారు. అదే రోజు పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇప్పుడు ఈ డేట్‌న కూడా ప్రారంభోత్సవం చేసేందుకు అడ్డంకులు ఉన్నట్లు సమాచారం.
ఏప్రిల్ 30న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో కోడ్ అమలులో ఉండబోతోంది. పరేడ్ గ్రౌండ్స్ కంటోన్మెంట్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి సభకు అనుమతి లభించడం కష్టమేనని తెలుస్తున్నది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో ఉండే ఈ గ్రౌండ్‌లో సభ నిర్వహించడానికి ఎలాంటి ఎలక్షన్ కోడ్ అమలులో లేనప్పుడే బీఆర్ఎస్‌కు అనుమతి ఇవ్వలేదు. ఇప్పడు ఎస్సీబీ ఎన్నికలు ఉండటంతో పరేడ్ గ్రౌండ్‌లో అనుమతి దొరకదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎస్సీబీ ఎన్నికల కోడ్ అమలులో ఉంటే సెక్రటేరియట్ ఓపెనింగ్‌కు ఏమైనా ఇబ్బందా అనే విషయంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై ప్రభుత్వ వర్గాలు కేంద్ర రక్షణ శాఖను సంప్రదిస్తున్నట్లు తెలుస్తున్నది. ఒక వేళ అనుమతి లేకుంటే సెక్రటేరియట్ ఓపెనింగ్ మరింత ఆలస్యం కావొచ్చని అధికారులు అంటున్నాయి. సభకు అనుమతి ఇవ్వకుండా సెక్రటేరియట్ ఓపెనింగ్‌కు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ పార్టీ వర్గాలకు చెప్పినట్లు సమాచారం.
ఏప్రిల్ 14న సెక్రటేరియట్ ఓపెనింగ్‌కు ఎలాంటి ఆటంకాలు లేకపోయినట్లయితే.. పరేడ్ గ్రౌండ్స్ కాకుండా మరో ప్రదేశంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఓపెనింగ్‌కు గతంలో పిలిచిన సీఎంలు, నాయకులను మరోసారి సంప్రదించి.. వారు ఓకే చెప్పిన తర్వాత సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. వరుసగా ఎన్నికల కోడ్‌లు అమలులో ఉండటం వల్లే సెక్రటేరియట్ ప్రారంభోత్సవం ఆలస్యం జరుగుతోందని.. పనులు మొత్తం పూర్తయ్యాయని అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు.