Telugu Global
Telangana

రూ. 1,571 కోట్లతో నిమ్స్ విస్తరణ..జీవో విడుదల చేసిన ప్రభుత్వం

తెలుగు రాష్ట్రాల వారికే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఈ ఆసుపత్రికి భారీగా రోగులు వస్తుంటారు. దీంతో ఇప్పుడు ఉన్న భవనాలు సరిపోవడం లేదు.

రూ. 1,571 కోట్లతో నిమ్స్ విస్తరణ..జీవో విడుదల చేసిన ప్రభుత్వం
X

ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ఓకే రోజు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో వైద్య రంగం బలోపేతానికి భారీగా నిధులు కేటాయిస్తున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రోగులకు కూడా తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న నిమ్స్ (నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను మరింతగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల వారికే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఈ ఆసుపత్రికి భారీగా రోగులు వస్తుంటారు. దీంతో ఇప్పుడు ఉన్న భవనాలు సరిపోవడం లేదు.

గతంలో నిమ్స్ కోసం ప్రత్యేకంగా బీబీనగర్‌లో క్యాంపస్ నిర్మించారు. కానీ, దానిలో కొంత భాగాన్ని ఎయిమ్స్ కోసం ప్రభుత్వం కేటాయించింది. దీంతో పంజాగుట్టలోని నిమ్స్ విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నిమ్స్‌ను విస్తరించడానికి రూ. 1,571 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆసుపత్రి విస్తరణకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది.

నిమ్స్‌కు భారీగా నిధులు కేటాయించడంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. నిమ్స్ విస్తరణ కోసం ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని పేర్కొన్నారు. విజనరీ నేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం.. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇదొక అడుగు అని అన్నారు.



First Published:  16 Nov 2022 6:13 PM IST
Next Story