స్వచ్ఛ అవార్డుల్లో తొలి మూడుస్థానాలు తెలంగాణకే..
ఈ ర్యాంకింగ్ లపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో తెలంగాణ జిల్లాలను ముందు నిలిపేందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్లను, ఇతర అధికారులను మంత్రి కేటీఆర్ అభినందించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 లో భాగంగా కేంద్రం ప్రకటించిన 4 స్టార్ కేటగిరీ ర్యాంకింగ్ లలో దేశంలోనే తొలి మూడు స్థానాలను తెలంగాణ కైవసం చేసుకుంది. అందులో రాజన్న సిరిసిల్లా నెంబర్-1 గా ఉండటం విశేషం. ఈ ర్యాంకింగ్ లపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో తెలంగాణ జిల్లాలను ముందు నిలిపేందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్లను, ఇతర అధికారులను మంత్రి కేటీఆర్ అభినందించారు. పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి శుభాకాంక్షలు తెలిపారు.
Telangana tops again
— KTR (@KTRTRS) January 4, 2023
All of the Top 3 districts in #SwachhSurvekshanGrameen2023 are from #Telangana
Many Congratulations to Panchayat Raj Minister @DayakarRao2019 Garu and his department
Special congratulations to @Collector_RSL @Collector_KNR and @Collector_PDPL https://t.co/xcF9Fx5xG2
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్..
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 లో వివిధ కేటగిరీల్లో అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో 4 స్టార్ కేటగిరీలో తెలంగాణకు అవార్డుల పంట పండింది. అవార్డుల్లో తొలి మూడు స్థానాలు తెలంగాణకే దక్కడం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మొదటి స్థానం, కరీంగనర్ జిల్లాకు రెండో స్థానం, పెద్దపల్లి జిల్లాకు మూడో స్థానం లభించింది. కేంద్ర ప్రభుత్వ తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ ట్విట్టర్ లో ర్యాంకుల వివరాలు పోస్ట్ చేసింది.
ఓడీఎఫ్ గ్రామాలు..
బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాల లెక్క తీసి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ఇస్తుంటారు. ఇళ్లలో మరుగుదొడ్ల వాడకం, అన్ని గ్రామాల్లో తడి, పొడిచెత్త సేకరణను ప్రామాణికంగా తీసుకుంటారు. మురుగునీటి నిర్వహణ, పరిశుభ్ర తాగునీటి పంపిణీ, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు కూడా మార్కులుంటాయి. చెత్త నిర్వహణ విషయంలో కంపోస్ట్ షెడ్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని ఆధారంగా చేసుకుని కేంద్రం ఈ ర్యాంకులు ఇచ్చింది. వీటిలో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి, దేశవ్యాప్తంగా కూడా ఈ మూడు జిల్లాలు టాప్ ప్లేస్ లో ఉండటం విశేషం.