తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పై రగిలిపోతోందా..?
బీఆర్ఎస్ ఆరోపణలు చూస్తుంటే తెలంగాణలో రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంతో ఉన్నట్టు అర్థమవుతోంది. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే కాంగ్రెస్ అంటే ఏంటో రైతులకు అర్థమైందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని వర్గాలతోపాటు రైతులు కూడా కాంగ్రెస్ ని పూర్తిగా నమ్మారు. ఇందిరమ్మ పాలనలో కరెంటు ఉండదు, ఇబ్బందులు పడతారంటూ బీఆర్ఎస్ విమర్శలదాడి చేసినా కూడా రైతాంగం కాంగ్రెస్ వైపు మొగ్గుచూపిందనేది ఫలితాలనుబట్టి తేలిన వాస్తవం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏం చేస్తున్నట్టు..? మహిళలకోసం ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు, సిలిండర్ రేటు తగ్గించారు, పేదలకోసం జీరో కరెంటు బిల్లులు ఇస్తున్నారు. నియామకాల ప్రక్రియ మొదలు పెట్టి నిరుద్యోగులను కూడా కొంతవరకు శాంతింపజేశారు. అయితే రైతుల విషయంలో మాత్రం కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ తప్పదని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. హరీష్ రావు సహా ఇతర కీలక నేతలు నేరుగా క్షేత్ర స్థాయిలో రైతులను కలుస్తున్నారు. రుణమాఫీ, సాగునీటి ఇబ్బందులు, కరెంటు సరఫరా.. ఇతరత్రా అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.
రుణమాఫీ ప్రకటించకపోవడంతో పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకర్ల నుంచి వేధింపులు అధికమయ్యాయని అన్నారు హరీష్ రావు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే లక్షలాది రైతులతో సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మరోవైపు సాగునీరు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని, బీఆర్ఎస్ హయాంలో గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పారు. ఓవైపు రైతులు ఇలా కష్టాల్లో ఉంటే, మరోవైపు బ్యాంకులనుంచి నోటీసులేంటని సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు.
కేటీఆర్ కూడా ఇటీవల ఇదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. తప్పుడు హామీలతో రైతుల్ని రేవంత్ రెడ్డి నిలువునా ముంచేశారని, మోసం చేశారని అన్నారాయన. ఎన్నికల ముందు రుణాలు తీసుకోవాలని రైతుల్ని ప్రోత్సహించిన రేవంత్, మాఫీ పేరుతో మాయమాటలు చెప్పారని, తీరా ఎన్నికల తర్వాత ప్లేటు ఫిరాయించారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కేటీఆర్.
బీఆర్ఎస్ ఆరోపణలు చూస్తుంటే తెలంగాణలో రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంతో ఉన్నట్టు అర్థమవుతోంది. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే కాంగ్రెస్ అంటే ఏంటో రైతులకు అర్థమైందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి ఈ వ్యతిరేకత లోక్ సభ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందా..? ఆ లోగా ప్రభుత్వం అన్నదాతలను ఆకట్టుకునే ప్రకటన చేస్తుందా..? వేచి చూడాలి.