రుణమాఫీతో రైతన్న సంబరం.. రెండు రోజుల్లో 94,097 మందికి లబ్ధి
ఈ దఫా మొత్తం రుణమాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.18,241 కోట్లు విడుదల చేసింది. విడతల వారీగా రుణమాఫీ అమలు కావడంతో.. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ రెండోవారం లోగా రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుంది.
తెలంగాణలో రైతు రుణమాఫీతో అన్నదాతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఊరూవాడా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈనెల 4నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలైంది. నెలన్నర రోజులుగా రైతాంగం మొత్తానికి రుణమాఫీ చేయాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. విడతల వారీగా రైతు రుణాలు మాఫీ అవుతున్నాయి.
తొలిరోజు..
రుణమాఫీ అమలులోకి వచ్చిన శుక్రవారం 41వేల రూపాయల వరకు గల పద్దులను రద్దు చేశారు. 41వేల రూపాయల మేరకు తెలంగాణలో 62,758 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. వారు తీసుకున్న మొత్తం రూ.237.85 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.
రెండోరోజు..
రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రెండోరోజైన శుక్రవారం 31,339 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. రూ.41 వేల నుంచి రూ.43 వేల మధ్య రుణాలు కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.126.50 కోట్ల మేర ఉపశమనం కలిగించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 94,097 మంది రైతులకు చెందిన రూ.364.34 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి.