Telugu Global
Telangana

మీకు రుణమాఫీ కాలేదా..? అయితే ఇలా చేయండి

రైతులు ప్రత్యేకంగా ఏ అధికారి వద్దకు, లేదా ఆఫీస్ కి వెళ్లాల్సిన పనిలేదు. గ్రామాల్లోకి వచ్చే సర్వే టీమ్ లకు తమ ఇబ్బందులు చెబితే వారు యాప్ లో వారి వివరాలు నమోదు చేసుకుంటారు.

మీకు రుణమాఫీ కాలేదా..? అయితే ఇలా చేయండి
X

తెలంగాణలో రుణమాఫీ అంశం రాజకీయాలను వేడెక్కించింది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. రుణమాఫీ పూర్తిగా జరగలేదనే విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. మొదట్లో రుణమాఫీపై గట్టిగా మాట్లాడినా ఆ తర్వాత తప్పు జరిగిందని ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రత్యేక యాప్ ద్వారా రుణమాఫీ కాని వారి వివరాలు సేకరించి, వారికి న్యాయం చేస్తామంటోంది.

రైతు భరోసా యాప్..

అర్హులై ఉండి కూడా రుణమాఫీ వర్తించని రైతుల వివరాలు నమోదు చేయడానికి 'రైతుభరోసా పంట రుణమాఫీ యాప్‌'ను తెలంగాణ వ్యవసాయశాఖ రూపొందించింది. అధికారులు గ్రామాలకు వెళ్లి రుణమాఫీ కానివారి వద్ద వివరాలు సేకరించి ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైతుల నుంచి సెల్ఫ్ సర్టిఫికెట్ తీసుకుని, స్థానిక పంచాయతీ కార్యదర్శి రిపోర్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం నుంచి ఈ సర్వే మొదలవుతుంది. అంటే రైతులు ప్రత్యేకంగా ఏ అధికారి వద్దకు, లేదా ఆఫీస్ కి వెళ్లాల్సిన పనిలేదు. గ్రామాల్లోకి వచ్చే సర్వే టీమ్ లకు తమ ఇబ్బందులు చెబితే వారు యాప్ లో వారి వివరాలు నమోదు చేసుకుంటారు. వాటన్నిటినీ పరిశీలించి ఉన్నతాధికారులు వారికి నిధులు విడుదల చేస్తారు.

ఇప్పటి వరకు రూ.2లక్షల లోపు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే మూడు విడతల్లో మాఫీ జరిగింది, అది కూడా అరకొరగానే. ఇక రూ.2 లక్షల పైన రుణాలు తీసుకున్నవారికి మాఫీకోసం కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఉదాహరణకు రూ.5లక్షలు రుణాలు తీసుకున్నవారు ముందుగా రూ.3లక్షలు, వడ్డీ.. బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం మిగిలిన రూ.2లక్షలను మాఫీ చేస్తుంది. దీనిపై కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికిప్పుడు రైతుల వద్ద అప్పు చెల్లించేంత డబ్బు ఉంటుందా అని నిలదీస్తున్నారు. ముందు ప్రభుత్వం రూ.2 లక్షలు మాఫీ చేయాలని, ఆ తర్వాత మిగతా సొమ్ముని తాము ప్రభుత్వానికి చెల్లిస్తామని కోరుతున్నారు రైతులు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

First Published:  26 Aug 2024 4:01 AM GMT
Next Story