Telugu Global
Telangana

సీసీ కెమేరాల నిఘాలో తెలంగాణ ఎన్నికలు.. 18 వేల కేంద్రాల్లో కెమేరాలు

ఎన్నికలు జరిగిన ప్రతీ సారి వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ సరళిని పరిశీలించేవారు. కానీ ఈ సారి వెబ్ క్యాస్టింగ్ బదులు సీసీ కెమేరాలను ఉపయోగించనున్నారు.

సీసీ కెమేరాల నిఘాలో తెలంగాణ ఎన్నికలు.. 18 వేల కేంద్రాల్లో కెమేరాలు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్-డిసెంబర్ నెలల్లో జరగుతాయా లేదా అనే సందిగ్దం కొనసాగుతుండగా.. ఎన్నికల సంఘం మాత్రం తన పని తాను చేసుకొని పోతోంది. రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ఈ సారి రాష్ట్రంలోని సగం పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సున్నితమైన పోలింగ్ కేంద్రాలను పోలీస్ శాఖ ప్రస్తుతం గుర్తిస్తోంది. వాళ్లు ఇచ్చే నివేదిక ఆధారంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయనున్నారు.

ఎన్నికలు జరిగిన ప్రతీ సారి వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ సరళిని పరిశీలించేవారు. కానీ ఈ సారి వెబ్ క్యాస్టింగ్ బదులు సీసీ కెమేరాలను ఉపయోగించనున్నారు. రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 18 వేల కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిని హైదరాబాద్‌లోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. దీంతో ఆ 18 వేల కేంద్రాల్లో ఏం జరుగుతున్నదో సీఈవో ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది.

కొత్త ఓటర్ల నమోదుకు 10 లక్షల దరఖాస్తులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల సమీపిస్తుండటంతో ఎలక్షన్ కమిషన్ మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించింది. ఓటు నమోదు, సవరణ కోసం రాష్ట్రంలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 19 లక్షల దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందగా.. వాటిలో 10.27 లక్షల దరఖాస్తులు కొత్తగా ఓటు నమోదు చేయించుకుంటున్న వారివే కావడం గమనార్హం. ఇక అడ్రస్ ఛేంజ్ కోసం 5.58 లక్షలు, ఓట్ల తొలగింపు కోసం 3.50 లక్షల దరఖాస్తులు అందాయి.

మరో నాలుగు రోజుల్లో (సెప్టెంబర్ 19) గడువు ముగియనున్నది. అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 4న ఓటర్లు తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ జాబితా ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని సీఈవో వికాస్ రాజ్ అధికారులకు సూచించారు. గురువారం జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లు, 24 నియోజకవర్గాల ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో సమావేశం అయ్యారు.

ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 19 లోగా పరిష్కరించాలని వికాస్ రాజ్ ఆదేశించారు. మరణించిన వ్యక్తులు, వలస వెళ్లిన వారి వివరాలను సేకరించి జాబితాను పకడ్బందీగా తయారు చేయాలని సూచించారు. ఇక ఎన్నికల రోజు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా ఆకర్షించడానికి స్థానిక సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేకంగా అలంకరణలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది.

First Published:  15 Sept 2023 5:47 AM IST
Next Story