Telugu Global
Telangana

తెలంగాణ ఎన్నికలు.. సోషల్ మీడియాపై పోలీసుల నిఘా

ఎవరైనా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడితే వెంటనే ఎన్నికల కమిషన్‌కు తెలియజేసేందుకు పోలీసులు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు.

తెలంగాణ ఎన్నికలు.. సోషల్ మీడియాపై పోలీసుల నిఘా
X

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసులు నిఘా పెట్టారు. సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ఎన్నికల తీరుతెన్నులు మారిపోయాయి. తమ అభిమాన నాయకుడు, పార్టీని ఆకాశానికి ఎత్తేస్తూ పోస్టులు, వీడియోలు పెడుతుంటారు. మరోవైపు తమకు నచ్చకపోతే దుష్ప్రచారం చేసే వాళ్లు కూడా ఉంటారు. అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారి సంఖ్య ఈ మధ్య పెరిగిపోయింది. ఈ క్రమంలో పోలీసులు అలాంటి పోస్టులపై నిఘా పెట్టారు.

ఎవరైనా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడితే వెంటనే ఎన్నికల కమిషన్‌కు తెలియజేసేందుకు పోలీసులు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాంటి పోస్టులు పెట్టే వారిపై, బాధ్యులైన అభ్యర్థులు, రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అనేక రకాల పద్దతుల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులకు వ్యతిరేకంగా రకరకాలు పోస్టులు పెడుతుంటారు.

సోషల్ మీడియా అకౌంట్లు నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీలు సొంతగా ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇందుకోసం రూ.కోట్లలో సొమ్మును వెచ్చిస్తున్నాయి. కొంత మంది ప్రత్యర్థులపై బురద చల్లేందుకు కూడా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. వీడియోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేయడం వల్ల వ్యక్తిగత ప్రతిష్టకు కూడా భంగం కలుగుతోంది. ఇవన్నీ ఐటీ చట్టం ప్రకారం ఉల్లంఘనల కిందకే వస్తాయని పోలీసులు చెబుతున్నారు.

ఇలాంటి వాటిని గమనించేందుకు పోలీసు శాఖ ప్రతీ జిల్లాలో సోషల్ మీడియా ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. ఆయా జిల్లాల్లో సామాజిక మాధ్యవాల ద్వారా జరిగే అనేక రకాల ప్రచారాలను ఈ ల్యాబ్‌లు కన్నేసి ఉంచుతాయి. ఎవరైనా పరిధి దాటి తప్పుడు, అభ్యంతరకరమైన పోస్టు పెడితే వెంటనే గుర్తించి కేసులు నమోదు చేయనున్నారు. అంతే కాకుండా వాళ్లు ఏ పార్టీ, ఏ నాయకుడికి అనుబంధంగా పని చేస్తున్నారనే వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందజేస్తారు. వెంటనే సంబంధిత వ్యక్తులకు నోటీసులు కూడా జారీ చేయనున్నట్లు పోలీసు శాఖ తెలిపింది.

First Published:  4 Nov 2023 8:12 AM IST
Next Story