మొదటి రోజు నామినేషన్ల సెంచరీ.. 55 నియోజకవర్గాల్లో జీరో
సీఎం కేసీఆర్ పోటీ చేయబోతున్న కామారెడ్డిలో తొలిరోజు ముగ్గురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు. గజ్వేల్ లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ నిన్న(శుక్రవారం) విడుదల కాగా అదేరోజు నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు మొత్తంగా 100 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి తొలిరోజు 64 నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు అభ్యర్థులు. మిగతా 55 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఆర్వో కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేయబోతున్న కామారెడ్డిలో తొలిరోజు ముగ్గురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు. గజ్వేల్ లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ ఈరోజు తన నామినేషన్ పత్రాలను కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్తారు. నామినేషన్ పత్రాలపై ఆయన ఈరోజే సంతకం చేస్తారు. అయితే వాటిని ఈనెల 9న ఆయా నియోజకవర్గాల్లోని ఆర్వో కార్యాలయాల్లో అందజేస్తారు.
నామినేషన్ వేసేందుకు వచ్చే నాయకులతో ఆర్వో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఆర్వో కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అభ్యర్థితో పాటు, నామినేషన్ కేంద్రంలోకి మరో నలుగురిని మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రస్తుతానికి నామినేషన్ల పర్వం నామమాత్రంగానే కొనసాగుతోంది. ఐదో తేదీ తర్వాత ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంటుంది.
ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 5 ఆదివారం కావడంతో నామినేషన్లకు సెలవు. 10వ తేదీ డెడ్ లైన్ పూర్తయిన తర్వాత నవంబర్ 13న నామినేషన్లు పరిశీలిస్తారు. నవంబర్ 15 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదేరోజు తుది జాబితా ప్రకటిస్తారు. నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు సింగిల్ ఫేజ్ లో పూర్తవుతాయి.
♦