Telugu Global
Telangana

కాంగ్రెస్ సీఎం.. భట్టి విక్రమార్క ఏమన్నారంటే..?

కాంగ్రెస్ పార్టీ 74 నుంచి 78 స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. త్వరలోనే రెండో విడత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు.

కాంగ్రెస్ సీఎం.. భట్టి విక్రమార్క ఏమన్నారంటే..?
X

మా సీఎం కేసీఆర్.. హ్యాట్రిక్ కొట్టేది ఆయనే, దక్షిణాదిలో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించేది కూడా ఆయనేనంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కానీ కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి అలా లేదు. బీజేపీ మరీ సీఎం దాకా వెళ్లలేదు కానీ, కాంగ్రెస్ లో మాత్రం అప్పుడే మల్లగుల్లాలు మొదలయ్యాయి. పొరపాటున కాంగ్రెస్ కి ఓటేస్తే.. నలుగురైదుగురు సీల్డ్ కవర్ సీఎంలు వస్తారంటూ బీఆర్ఎస్ ఆల్రడీ సెటైర్లు పేలుస్తోంది. ఈ దశలో కాంగ్రెస్ నేతలు కూడా సీఎం కుర్చీపై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా మల్లు భట్టి విక్రమార్క సీఎం పదవి విషయంలో స్పందించారు.

ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇక సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారాయన. సీఎల్పీ సమావేశంలో సీఎం ఎంపిక జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 74 నుంచి 78 స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు భట్టి. త్వరలోనే రెండో విడత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు. సీఎం పదవి అనేది ఇప్పుడు నిర్ణయించేది కాదని, సీఎల్పీలోనే అది ఫైనల్ అవుతుందని కుండబద్దలు కొట్టారు.

ఇటీవల సీఎం పదవిపై కాంగ్రెస్ లో చాలామంది స్పందించారు. సీతక్క సీఎం అభ్యర్థి అయితే తప్పేంటి అని ఆమధ్య రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ ఇవ్వడంతో అసలు గొడవ మొదలైంది. ఆ తర్వాత చాలామంది సీఎం సీటుపై స్పందించారు. ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా హామీల అమలు గురించి ధీమాగా చెబుతూ.. "రేపు కాంగ్రెస్ వస్తే మాలోనే ఎవరో ఒకరు సీఎం అవుతారు, నాతోపాటు మరో నలుగురు సీఎం అభ్యర్థులు ఉన్నారు" అని చెప్పారు. తాజాగా జగ్గారెడ్డి తాను కూడా సీఎం అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మల్లు భట్టి విక్రమార్క సీఎం సీటుపై స్పందించారు. ఆయన మాత్రం ఎవరెవరు రేసులో ఉన్నారు, ఎవరెవరు ఆ కుర్చీపై ఆశపడుతున్నారనే విషయాలను ప్రస్తావించకుండా సింపుల్ గా సీఎల్పీ తేల్చేస్తుందని స్టేట్ మెంట్ ఇచ్చారు.

First Published:  24 Oct 2023 10:36 PM IST
Next Story