మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణకు కేంద్ర బలగాలు
గజ్వేల్, కామారెడ్డి, కొడంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, హుజూరాబాద్ తదితర నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. మతపరమైన ఉద్రిక్తతలకు అవకాశం ఉన్న ప్రాంతాలకు కూడా బలగాలను తరలించారు. రాత్రిపూట తెలంగాణ పల్లెల్లో గస్తీ కూడా పెంచారు.

మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లో ఎన్నికలు ముగియడంతో అక్కడినుంచి కేంద్ర బలగాలను తెలంగాణకు తరలిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడటంతో ఇక్కడికి బలగాలను చేరుస్తున్నారు. ఈసారి తెలంగాణ ఎన్నికలకోసం మొత్తం 375 కంపెనీల కేంద్ర బలగాలను తరలిస్తున్నారు. ఇప్పటికే 100 కంపెనీలకు పైగా బలగాలు ఇక్కడికి వచ్చాయి. మిగతా సిబ్బంది రెండు రోజుల్లో చేరుకుంటారు. ఒక్కో కంపెనీలో 60-80 మంది చొప్పున సుమారు 25 వేల మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారు.
కేంద్ర బలగాలే కాకుండా.. పొరుగు రాష్ట్రాలనుంచి కూడా పోలీసులను తరలిస్తున్నారు. 2018 ఎన్నికల కోసం కేవలం 18వేల మంది సిబ్బందిని ఇతర రాష్ట్రాలనుంచి తీసుకోగా, ఈసారి 25వేల వరకు పక్క రాష్ట్రాల పోలీసులు తెలంగాణ ఎన్నికలకోసం వస్తున్నారు. వీరికి తోడు రాష్ట్రంలో ఉన్న 65 వేలమంది పోలీసులు 18 వేల మందికి హోంగార్డులలలో దాదాపు 70 శాతం మందికి ఎన్నికల విధులు కేటాయిస్తారు. కేంద్ర బలగాలయినా, రాష్ట్రాల పోలీసులయినా ఈసారి లక్షమందికి పైగా భద్రతా సిబ్బంది తెలంగాణ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు.
భద్రత కట్టుదిట్టం..
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కారుపై దాడి సహా.. చెదురుమదురు ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా జరిగాయి. దీంతో పోలీసులు భద్రత మరింత పెంచారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంలో కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓటర్లకు తాయిలాలు పంచుతున్నారంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ కేసుల విచారణకు కూడా పోలీసులు క్షేత్ర స్థాయికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. గజ్వేల్, కామారెడ్డి, కొడంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, హుజూరాబాద్ తదితర నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. మతపరమైన ఉద్రిక్తతలకు అవకాశం ఉన్న ప్రాంతాలకు కూడా బలగాలను తరలించారు. రాత్రిపూట తెలంగాణ పల్లెల్లో గస్తీ కూడా పెంచారు.