ఎన్నికల వేళ.. రికార్డు స్థాయిలో 426 ఎఫ్ఐఆర్ లు
పోలింగ్ డే రోజు ఎలాంటి హంగామా ఉంటుందో అనే ఆందోళన కూడా అందరిలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకుని, పోలింగ్ రోజున మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులకు సూచించింది ఈసీ.
తెలంగాణలో ఎన్నికల వేళ భారీగా నగదు, మద్యం పట్టుబడటం చూస్తూనే ఉన్నాం. గత ఎన్నికల సీజన్ రికార్డులన్నీ ఈసారి సీజన్ మొదలైన 10రోజుల్లోనే బద్దలయ్యాయి. ఇక ఎన్నికల క్రైమ్ రేటు కూడా ఈసారి బాగా పెరిగింది. నిరసనలు, ఆందోళనలే కాదు, తోపులాటలు, కొట్లాటలు, చివరికి కత్తిపోట్లు కూడా ఈసారి సంచలనంగా మారాయి. ఎన్నికల సీజన్ మొదలయ్యాక ఇప్పటి వరకు తెలంగాణలో 426 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని అధికారిక సమాచారం.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి రికార్డు స్థాయిలో 426 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దీనిపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. సమస్యలు తలెత్తకుండా చూడటంలో విఫలమవుతున్నారంటూ పోలీస్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల నియమావళి ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలిచ్చింది. విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్టు సమాచారం.
ఎన్నికల సీజన్ మొదలైన తర్వాత ఈసారి అన్ని ఏజెన్సీలు అప్రమత్తం అయ్యాయి. తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. అందుకే నగదు, బంగారం, బహుమతులు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. అయితే శాంతిభద్రతల విషయంలో కూడా పోలీసులు అలర్ట్ గా ఉన్నా.. నేరాలు మాత్రం ఆగలేదు. ఈసారి తెలంగాణలో మూడు పార్టీలు పోటాపోటీగా బల ప్రదర్శనలు చేపడుతున్నాయి. ర్యాలీలు, రోడ్ షో లతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో నామినేషన్లు కూడా ఒకేరోజు, ఒకే టైమ్ లో వేయాలని కొంతమంది ప్రత్యర్థులు పట్టుబట్టి మరీ ఆరోజు గొడవలకు కారణం అయ్యారు. రాళ్లు రువ్వుకున్న ఘటనలు జరిగాయి. అన్నిటికంటే ఆందోళన కలిగించే ఘటన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం. గతంలో ఎప్పుడూ తెలంగాణ ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు జరగలేదు. ఈసారి హత్యాయత్నం కూడా రికార్డ్ కావడం సంచలనంగా మారింది. ఆ తర్వాత అభ్యర్థుల ప్రచారంపై పోలీసులు మరింత ఫోకస్ పెట్టారు, వారికి భద్రత పెంచారు. ఇక పోలింగ్ డే రోజు ఎలాంటి హంగామా ఉంటుందో అనే ఆందోళన కూడా అందరిలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకుని, పోలింగ్ రోజున మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులకు సూచించింది ఈసీ.