Telugu Global
Telangana

ముగిసిన నామినేషన్లు.. చివరి రోజు సందడే సందడి

చివరి రోజు కొంతమంది అభ్యర్థుల జాతకాలు తారుమారయ్యాయి. ఒకరిని జాబితాలో ప్రకటించి, మరొకరికి పార్టీలు బీఫామ్ లు అందజేశాయి. ఈ రోజే బీ ఫామ్ ల సమర్పణకు కూడా తుది గడువు కావడంతో అభ్యర్థులు హడావిడి పడ్డారు.

ముగిసిన నామినేషన్లు.. చివరి రోజు సందడే సందడి
X

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్లపై అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. గురువారం సాయంత్రం వరకు మొత్తం 2,474 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు మొత్తం వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలై ఉంటాయని సమాచారం. నామినేషన్ల చివరి రోజున ఆర్వో కార్యాలయాల ముందు సందడి నెలకొంది.

ఈనెల 3వతేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఆ రోజునుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. మధ్యలో ఒక ఆదివారం మాత్రం సెలవురోజు కావడంతో నామినేషన్లు తీసుకోలేదు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. నిన్న గురువారం మంచిరోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, కాంగ్రెస్, బీజేపీలోని కీలక నేతలు కూడా నిన్న నామినేషన్లు వేశారు. ఈ రోజు కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ నెల 13 వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15వ తేదీలోపు నామినేషన్లు ఉపసంహరించుకోడానికి అవకాశం ఉంటుంది. 15వ తేదీ బరిలో ఉన్న అభ్యర్థుల లిస్ట్ ప్రకటిస్తారు అధికారులు.

అభ్యర్థుల్లో టెన్షన్..

చివరి రోజు కొంతమంది అభ్యర్థుల జాతకాలు తారుమారయ్యాయి. ఒకరిని జాబితాలో ప్రకటించి, మరొకరికి పార్టీలు బీఫామ్ లు అందజేశాయి. ఈ రోజే బీ ఫామ్ ల సమర్పణకు కూడా తుది గడువు కావడంతో అభ్యర్థులు హడావిడి పడ్డారు. పార్టీ బీ-ఫామ్‌ లేకుండా నామినేషన్ వేసినవారిని ఈసీ స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటిస్తుంది. నామినేషన్‌ సమయంలో 100మందికి పైగా అభ్యర్థులు అఫిడవిట్లు సమర్పించలేదని సమాచారం. వారికి రిటర్నింగ్‌ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారు.

గత ఎన్నికల్లో..

గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి 2,399 నామినేషన్లు దాఖలు కాగా అందులో 456 రిజెక్ట్ అయ్యాయి. మరో 367 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. చివరకు 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ తర్వాత వీరిలో 1,569 మందికి డిపాజిట్లు రాలేదు. ఈసారి నామినేషన్ల సంఖ్య పెరిగే అవకాశముంది.

First Published:  10 Nov 2023 11:43 AM GMT
Next Story