అక్టోబర్‌లోనే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్.. కసరత్తు చేస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం!
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యటన అనంతరం ఎన్నికల షెడ్యూల్‌పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. దాదాపుగా అక్టోబర్‌లో షెడ్యూల్ ప్రకటించి.. డిసెంబర్ 17లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారని తెలుస్తున్నది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. ఒకవైపు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిర్వహిస్తూనే.. మరోవైపు ఎన్నికల తేదీలు ఖరారు చేసేందుకు విస్తృతంగా కసరత్తు చేస్తోంది. దాదాపు 2018లో ప్రకటించిన షెడ్యూల్‌కు దగ్గరగా 2023 ఎన్నికల తేదీలు రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్దతపై అధ్యయనం చేసేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం తెలంగాణకు రానున్నది.
2018లో ముందస్తు ఎన్నికలు జరిగిన సమయంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మీజోరాంలతో పాటు ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ తొలి సారి 2019 జనవరి 17న కొలువైంది. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి 16 వరకు అసెంబ్లీకి గడువు ఉన్నది. అయితే మీజోరాం రాష్ట్ర అసెంబ్లీ గడువు మాత్రం డిసెంబర్ 17తో ముగియనున్నది. దీంతో ఆ రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఒకే సారి షెడ్యూల్ విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు.
ఈ ఐదు రాష్ట్రాల్లో అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రభుత్వ సెలవులు, స్థానిక పండుగలు ఏవైనా ఉన్నాయా అని కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. తెలంగాణలో ఈ రెండు నెలల్లో దసరా, బతుకమ్మ, దీపావళి పండుగల ఉంటాయి. ఇవి తప్ప వేరే సెలవులు ఏవీ లేనట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. దీంతో ఆయా పండగలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చెందిన పూర్తి స్థాయి బృందం రెండు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించి.. షెడ్యూల్‌కు అనుకూలమైన తేదీలపై రాష్ట్ర అధికారులతో చర్చించనుంది. అలాగే స్థానికంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయో కూడా అధ్యయనం చేయనున్నది. ఆ తర్వాతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని తెలుస్తున్నది. అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉన్నది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యటన అనంతరం ఎన్నికల షెడ్యూల్‌పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. దాదాపుగా అక్టోబర్‌లో షెడ్యూల్ ప్రకటించి.. డిసెంబర్ 17లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారని తెలుస్తున్నది.