స్వాధీనం చేసుకున్న సొత్తుకు.. ఆధారాలు చూపిస్తే మర్నాడే తిరిగిచ్చేస్తాం
నగదు, బంగారం, ఆభరణాలు తదితరాలను అధికారులు స్వాధీనం చేసుకుంటే.. వెంటనే రసీదు ఇస్తారు. ఈ రసీదును అడిగి తీసుకోవడం తప్పనిసరి.
ఎన్నికల కోడ్ వచ్చిందంటే వ్యాపార వ్యవహారాల్లో ఉన్నవారందరికీ పెద్ద తలనొప్పే. 50వేలు దాటి నగదు దగ్గరుంటే పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. అత్యవసర వ్యాపార, వ్యవహారాల మీద వెళ్లేవారికి ఇది చాలా ఇబ్బంది. తీసుకున్న డబ్బు, నగలు వంటివి మళ్లీ ఎప్పుడు తిరిగిస్తారోనని కంగారు. అలాంటిదేమీ లేదని.. స్వాధీనం చేసుకున్న నగదు, నగలు వంటి సొత్తుకు రసీదు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ చెప్పారు.
రసీదు, ఆధారాలతో వస్తే తర్వాత రోజే ఇచ్చేస్తారు
నగదు, బంగారం, ఆభరణాలు తదితరాలను అధికారులు స్వాధీనం చేసుకుంటే.. వెంటనే రసీదు ఇస్తారు. ఈ రసీదును అడిగి తీసుకోవడం తప్పనిసరి. ఆ రసీదు, ఆ నగలు, నగదు మీవేనన్న ఆధారాలు అంటే బిల్లులు, బ్యాంకు అకౌంట్ డిటెయిల్స్ వంటివి తీసుకుని మర్నాడు ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆఫీస్ వద్దకు విచారణకు వెళ్లాలి. మీ దగ్గరున్న ఆధారాలను పరిశీలించిన అధికారులు ఎన్నికల నిబంధనల మేరకు అన్నీ సక్రమంగా ఉంటే మీ సొత్తు మీకు అక్కడే తిరిగిచ్చేస్తారని వికాస్‌రాజ్ వివరించారు.
ఇప్పటి వరకు రూ.100 కోట్ల స్వాధీనం
లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఇప్పటి వరకు రూ.100 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నామని వికాస్‌రాజ్ వెల్లడించారు. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.800 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నామని, అయితే ఆధారాలు చూపించినవారికి వారి సొత్తును తిరిగిచ్చేశామని వివరించారు.