కౌంటింగ్ కేంద్రాల వద్ద కఠిన నిబంధనలు.. మద్యం దుకాణాలు బంద్
కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కి సమయం దగ్గరపడింది. రేపు ఉదయం నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. గంటల వ్యవధిలోనే మెజార్టీ ఏవైపో తేలిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ కన్ఫ్యూజన్‌తో.. కౌంటింగ్ పై ఆసక్తి మరింత పెరిగింది. ప్రచారం, పోలింగ్ సందర్భంగా జరిగిన చెదురుమదురు సంఘటనల నేపథ్యంలో.. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
144 సెక్షన్..
కౌంటింగ్ జరిగే 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద చేయకూడని పనులు..
- కర్రలు, లాఠీలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలతో సంచరించడం నిషేధం
- గుంపులుగా ఐదుగురి కంటే ఎక్కువగా తిరగకూడదు
- మైక్‌లు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు చేయడం నిషేధం
- ఫొటోలు, సింబల్స్, ప్లకార్డుల ప్రదర్శన నిషేధం
- కులమత ద్వేషాలను రెచ్చగొడుతూ రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే ప్రసంగాలు చేయకూడదు
విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలిటరీ, ఎన్నికల అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత రాత్రికి మద్యం దుకాణాలు తెరుచుకునే అవకాశముంది.
*