తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. - ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ రద్దు
ఆయా బోర్డుల పరీక్షల ఫలితాలు కూడా ఆలస్యంగా విడుదల చేయడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత విద్యా మండలి ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఇంటర్ వెయిటేజీ రద్దు నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇకపై ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటివరకు ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లోని లాంగ్వేజ్ సబ్జెక్టులు కాకుండా మిగిలిన వాటికి వచ్చిన మార్కుల్లో 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. అంటే గ్రూప్ సబ్జెక్టులకు సంబంధించిన 600 మార్కుల్లో వీటిని పరిగణనలోకి తీసుకొని లెక్కించేవారు. ఇక నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెట్‌లో సాధించే మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇంటర్ మార్కులతో ఇచ్చే వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఇప్పటికే జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల్లోనూ ఇంటర్ వెయిటేజీ తొలగించారు. ఎంసెట్‌కి పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతారు. ఆయా బోర్డుల నుంచి విద్యార్థుల మార్కుల వివరాలను సకాలంలో ఎంసెట్ అధికారులకు అందించకపోవడం వల్ల ర్యాంకుల గణనలో జాప్యం జరుగుతోంది. ఆయా బోర్డుల పరీక్షల ఫలితాలు కూడా ఆలస్యంగా విడుదల చేయడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత విద్యా మండలి ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఇంటర్ వెయిటేజీ రద్దు నిర్ణయం తీసుకుంది.
కోవిడ్ కారణంగా 2020, 2021, 2022 సంవత్సరాల్లోనే ఇంటర్ వెయిటేజీని రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో ఇంటర్ వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేసినట్టయింది. గతంలో విడుదల చేసిన జీవోను సవరిస్తూ విద్యా శాఖ కార్యదర్శి వి.కరుణ తాజాగా జీవో నంబర్ 18ను విడుదల చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తాజా నిర్ణయాన్ని గుర్తించి ఎంసెట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.