Telugu Global
Telangana

ఎంసెట్ అంటే తెలంగాణే.. అందుకే ఏపీ నుంచి టాపర్లు

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 80 శాతం, అగ్రికల్చర్‌&మెడికల్‌ విభాగంలో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు.

ఎంసెట్ అంటే తెలంగాణే.. అందుకే ఏపీ నుంచి టాపర్లు
X

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విశేషం ఏంటంటే.. ఈ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు కూడా సత్తా చూపించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో టాప్‌-10లో 8 మంది, అగ్రికల్చర్‌, మెడికల్ విభాగంలో టాప్‌-10లో ఏడుగురు ఏపీ విద్యార్థులు ఉండటం గమనార్హం. ఏపీలో ఇంటర్ చదివిన విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలంగాణ ఎంసెట్ రాయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఫలితాల్లో ఏపీ విద్యార్థులు కూడా సత్తా చూపించారు.

కాసేపటి క్రితం హైదరాబాద్‌ లో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 80 శాతం, అగ్రికల్చర్‌&మెడికల్‌ విభాగంలో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. ఇటీవల నెలకొన్న కొన్ని పరిస్థితుల దృష్ట్యా పరీక్షల నిర్వహణలో అత్యంత జాగ్రత్త వహించామని చెప్పారు మంత్రి. అనుకున్న సమయానికి ఫలితాలు అందించేందుకు కృషి చేసిన అధికార యంత్రాంగాన్ని సబిత అభినందించారు.

ఏపీలో ఎంసెట్ పేరు మార్చేసి ఏపీ ఈఏపీ సెట్ అనే పేరుతో పరీక్షలు పెడుతున్నారు. ఏపీలోని ఇంజినీరింగ్ కాలేజీలకంటే తెలంగాణలోని కాలేజీలకే ఎక్కువ డిమాండ్ ఉంది. క్యాంపస్ ఇంటర్వ్యూలు, ఇతర మౌలిక సదుపాయాల్లో కూడా తెలంగాణలోని కాలేజీలకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. అందుకే ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణ ఎంసెట్ కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విషయంలో ఇటీవల ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గణాంకాలు కూడా అదే రుజువు చేస్తున్నాయి. ఏపీ విద్యార్థులకు తెలంగాణ ఎంసెట్ లో మంచి ర్యాంకులు రావడం విశేషం.

First Published:  25 May 2023 12:45 PM IST
Next Story