అన్ని ప్రాంతాల్లోనూ అలర్ట్‌గా ఉన్నాం.. ఎవరూ అధైర్యపడొద్దు
రాజధాని పరిధిలోని మూడు కమిషనరేట్లలో పరిస్థితి అదుపులో ఉందని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ముసారంబాగ్ వంతెనపై కూడా వరద నీరు అదుపులోనే ఉందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ వెల్లడించారు. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, గ్రే హౌండ్స్, ఇతర అధికారులతో కలిసి డీజీపీ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు.
మోచన్‌పల్లిలో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయని డీజీపీ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 2900 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు వివరించారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
రాజధాని పరిధిలోని మూడు కమిషనరేట్లలో పరిస్థితి అదుపులో ఉందని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ముసారంబాగ్ వంతెనపై కూడా వరద నీరు అదుపులోనే ఉందని చెప్పారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొంతమంది వరద ప్రవాహం వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు వచ్చి ప్రమాదానికి గురవుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పనులు చేయొద్దని కోరారు. విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు.