పోలవరం ముంపు సర్వేను వెంటనే చేపట్టాలని తెలంగాణ డిమాండ్
కొత్తగా మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని, భద్రాచలం పట్టణంలో 8 అవుట్ ఫాల్ రెగ్యులేటర్ స్థాయిలను ధృవీకరించాలని కోరుతోంది.
పోలవరం ముంపు సర్వేను వెంటనే చేపట్టాలని సీడబ్ల్యూసీని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. గత కొంత కాలంగా ముంపు అధ్యయనంపై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో తెలంగాణ కోరిన విధంగా తక్షణమే జాయింట్ సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీకి, ఏపీ సర్కారుకు సీడబ్ల్యూసీ అల్టిమేటం జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముంపుతో పాటు, ఇతర అనేక సాంకేతిక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఏపీ, ఒడిషా, చత్తీష్‌గఢ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అన్ని రాష్ట్రాలతో ఏకాభిప్రాయం సాధించాలని అత్యున్నత న్యాయ స్థానం సూచనలు చేసింది. దీంతో సీడబ్యూసీ రెండు సార్లు అన్ని రాష్ట్రాలతో సమావేశం అయ్యింది.
రెండు సమావేశాల్లో కూడా పోలవరం ముంపుపై జాయింట్ సర్వేకు తెలంగాణ పట్టుబట్టింది. తాజాగా మూడో సారి కేంద్ర జల సంఘం చైర్మన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రాజెక్టు ముంపు సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రం తమ వాదనలను మరోసారి బలంగా వినిపించింది. పోలవరం ముంపు సర్వే నిర్వహణను ఏపీ ప్రభుత్వం తాత్సరం చేస్తుండటాన్ని తెలంగాణ తీవ్రంగా నిరసించింది. గతంలోనే సీడబ్ల్యూసీ ఆదేశాలు జారీ చేసినా ఏపీ అసంబద్ద వాదనలతో సర్వే ప్రారంభించకపోవడాన్ని తప్పు బట్టింది.
పోలవరం ప్రాజెక్టులో ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవెల్)లో నీటిని నిల్వ చేసినప్పుడు తెలంగాణ భూభాగంలో ఏర్పడుతున్న ముంపును గుర్తించాలి. డ్రైనేజీ, స్థానిక ప్రవాహాలు నిలిచిపోవడం వల్ల వాటిల్లే ప్రభావాలపై, గతేడాది జులై వరదలపై తాజాగా ఉమ్మడి అధ్యయనం చేపట్టాలని తెలంగాణ కోరుతోంది. మణుగూరులోని హెవీ వాటర్ ప్లాంట్, భద్రాచలం ఆలయ రక్షణకు చర్యలు చేపట్టాలి. కొత్తగా మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని, భద్రాచలం పట్టణంలో 8 అవుట్ ఫాల్ రెగ్యులేటర్ స్థాయిలను ధృవీకరించాలని కోరుతోంది.
పోలవరం ప్రాజెక్టు కారణంగా కిన్నెరసాని, ముర్రేడువాగు నదుల నీటి పారుదల రద్దీకి సంబంధించి ఎన్జీటీ ఉత్తర్వులను అనుసరించి మొదటిగా 6 నుంచి 7 ఇతర పెద్ద స్థానిక ప్రవాహాలపై సర్వే చేయాలని డిమాండ్ చేస్తోంది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం చేసిన విధంగా ఏదైనా ఏజెన్సీతో పీపీఏ ఆధ్వర్యంలో జాయింట్ సర్వేను తక్షణమే చేపట్టాలని కోరింది. రాబోయే వర్షాకాలం దృష్ట్యా ముందుగానే సర్వేను చేయాలని పట్టుబడుతోంది. అప్పటి వరకు ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం కానీ, జలాశయాన్ని నిర్వహించడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేపట్టకూడదని వాదనలు వినిపించింది.