నాపై జరిగినంత దాడి.. ప్రపంచంలో ఏ నేతపై జరిగి ఉండదు..
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ ఉద్యమం నడిపామని చెప్పారు ముఖ్యమంత్రి. తన నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణ ప్రకటన వచ్చిందని, అయితే ఆ తర్వాత కూడా ఎన్నో కుట్రలు జరిగాయని, పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే చల్లే స్థాయికి దిగజారారని గుర్తు చేశారు కేసీఆర్.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో తెలంగాణ అమరవీరుల స్మారకం, అమరజ్యోతిని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఉద్యమ క్షణాలను ఆయన మరోసారి మననం చేసుకున్నారు. అమరవీరులపై రూపొందించిన ప్రదర్శనను మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి తిలకించారు కేసీఆర్. తెలంగాణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా బలిదానమిచ్చిన శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, పోలీసు కిష్టయ్య, సిరిపురం యాదయ్యల త్యాగాలను కొనియాడారు. వారి కుటుంబ సభ్యులను సత్కరించారు.
Watch Live: CM Sri KCR inaugurating the Telangana Martyrs Memorial in Hyderabad. https://t.co/Usu0srmoUl
— BRS Party (@BRSparty) June 22, 2023
అమరుల సంస్మరణ దినోత్సవం రెండు పార్శ్వాలు కలగలిసిన రోజు అని అన్నారు సీఎం కేసీఆర్. సంతోషం ఒక పాలు.. విషాదం రెండు పాళ్లుగా ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పేర్లు తలచుకోవాలని చెప్పారు.
నాపై జరిగిన దాడి..
తెలంగాణ ఏర్పాటుకి వ్యతిరేకంగా ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగాయని, అయినా ధైర్యంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించామని చెప్పారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దదని.. ఖమ్మం జిల్లా ఇల్లందులో ఉద్యమ తొలికేక వినిపించిందని గుర్తు చేశారు. ఉద్యమాన్ని ప్రారంభించే ముందు పిడికెడు మందితో మేధోమధనం చేశామని, వ్యూహాత్మకంగా మలిదశ ఉద్యమం ప్రారంభించామన్నారు. ఆజన్మ తెలంగాణ వాది ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శనంలోనే నడిచామని, చివరకు విజయం సాధించామన్నారు. రాజీనామాలను అస్త్రాలుగా వాడి ఉద్యమం నడిపామన్నారు కేసీఆర్. తనపై జరిగినంత దాడి ప్రపంచంలో ఏనేతపైనా జరిగి ఉండదని చెప్పారు.
వచ్చుడో.. సచ్చుడో..
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ ఉద్యమం నడిపామని చెప్పారు ముఖ్యమంత్రి. తన నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణ ప్రకటన వచ్చిందని, అయితే ఆ తర్వాత కూడా ఎన్నో కుట్రలు జరిగాయని, పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే చల్లే స్థాయికి దిగజారారని గుర్తు చేశారు కేసీఆర్. ఉద్యమంలో విద్యార్థుల ఆత్మబలిదానాలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. అమరులను నిత్యం స్మరించుకునేందుకే అమర జ్యోతి ఏర్పాటు చేశామన్నారు. అత్యుత్తమంగా నిర్మించుకునే దశలో కొంత జాప్యం జరిగినా అమర వీరుల స్మారకం అత్యద్భుతంగా తీర్చిదిద్దుకున్నామని చెప్పారు కేసీఆర్. ఈ సందర్భంగా 800 డ్రోన్లతో తెలంగాణ ప్రగతిపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.